దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కుటుంబంలో మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు రానా. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్‌బాబు పెద్ద కొడుకు అయిన రానా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో హీరో అయ్యాడు. తొలి సినిమాతోనే నటుడిగా తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాల్లో నటించాడు. తనకు తాను కమర్షియల్ హీరోగా ఫ్రూవ్ చేసుకోకుండా.. అన్ని భాషల్లోనూ నటిస్తూ అందరికి దగ్గరయ్యాడు.
ఇక బాహుబలి సినిమాతో నటుడిగా నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిపోయాడు. బాహుబలి తర్వాత కూడా తన మార్కెట్‌ను కాపాడుకుంటూ కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ ఇతర హీరోలతో స్క్రీన్ పంచుకునేందుకు కూడా చాలా ఇష్టపడతాడు. రుద్రమదేవి, భీమ్లానాయక్, బాహుబలి సినిమాలే ఇందుకు నిదర్శనం.
రానా, మిహికా బజాజ్‌ను ప్రేమించి పెద్దల అంగీకారంతో 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రానా పేరు వెనక చాలా ట్విస్ట్ ఉంది. రానా అంటే తన తాత పేరు రామానాయుడు. ముందుగా రానాకు సిద్ధార్థ్ అనే పేరు పెట్టాలని అనుకున్నారట రానా తల్లి దగ్గుబాటి లక్ష్మి. బారసాల రోజు బియ్యం మీద తన కొడుకు పేరు రాయాలని పంతులు గారు కోరిన వెంటనే సురేష్‌బాబు తన తండ్రి రామానాయుడు పేరు రాసేశారట.
తాను తన కొడుక్కి తండ్రి పేరే పెట్టాలని ఫిక్స్ అయిపోయానని అక్కడున్న వారితో చెప్పేశాడట. దీంతో భర్త కోరికను కాదలేని లక్ష్మి మౌనంగా ఉండిపోయిందట. అయితే రామానాయుడు మాత్రం సురేష్‌బాబు చేసిన పనికి చాలా సంతోషించారట. అయితే సురేష్‌బాబు ఫ్రెండ్స్‌ల్లో ఒకరు తాను రామానాయుడు అని పిలవలేనని.. రామా నాయుడు పదాల్లోని మొదటి అక్షరాలు కలిపి రానా అని పిలుస్తానని చెప్పి అలాగే పిలవడం ప్రారంభించారట.
అలా రామా నాయుడు పేరు కాస్తా రానాగా స్థిరపడిపోయింది. ఇప్పుడు రానా అదే పేరుతో పాపులర్ అయిపోయాడు. ఇది రానా పేరు వెనక ఉన్న హిస్టరీ. ఈ విషయాన్ని రానా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.