టాలీవుడ్లో ఈ సంక్రాంతి సినిమాల విడుదలకు చాలా రోజుల ముందు నుంచే థియేటర్ల విషయంలో పెద్ద రచ్చ జరిగింది. దిల్ రాజు తన వారసుడు సినిమా కోసం ఇద్దరు తెలుగు పెద్ద హీరోల సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డికి థియేటర్లు లేకుండా చేస్తున్నాడని.. చాలా తక్కువ థియేటర్లే ఇచ్చేలా చక్రం తిప్పుతున్నారంటూ ఒక్కటే రచ్చ జరిగింది.
తెరవెనక ఏం జరిగిందో కాని రాజు అప్పుడు ఓ మెట్టు దిగినట్టే అనిపించింది. జనవరి 11న అనుకున్న తన వారసుడు సినిమాను 14కు వాయిదా వేసుకున్నాడు. దీంతో వీరసింహారెడ్డికి 12న సోలో రిలీజ్ దక్కి.. ఎక్కువ థియేటర్లలో వేయడంతో భారీగా వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత 13న వాల్తేరు వీరయ్య, 14న వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలు వచ్చాయి.
దిల్ రాజు వారసుడు సినిమాను బాలయ్య, చిరంజీవి సినిమాల కోసమే వాయిదా వేస్తున్నట్టు చెప్పుకువచ్చారు. అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ తెరవెనక జరగాల్సింది జరిగిపోతోందని తెలుస్తోంది. వీరసింహారెడ్డికి వాల్తేరు వీరయ్యతో పోలిస్తే 5 % కు కాస్త అటూ ఇటూగానే కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వీరసింహారెడ్డి, వీరయ్య పోటాపోటీగానే ఉన్నాయి. అయితే వీరయ్య మల్టీస్టారర్ సినిమా… పైగా చిరుకు చాలా రోజుల తర్వాత హిట్ రావడంతో జనాలు, చిరు అభిమానులు చూస్తున్నారు.
వీరసింహారెడ్డి కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు సడెన్‌గా ఉన్నట్టుండి వీరసింహారెడ్డికి థియేటర్లు, స్క్రీన్లు తగ్గించేస్తున్నారు. హౌస్ ఫుల్స్ ఉండి.. సినిమా బ్రేక్ ఈవెన్‌కు దగ్గరవుతోన్న క్రమంలో ఇలా స్క్రీన్లు తగ్గించేయడం వెనక కుట్ర ఉందని బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. ఉదాహరణకు బుధవారం హైదరాబాద్‌లో చూస్తే వీరయ్యకు 400 + షోలు ఇస్తే… బాలయ్య వీరసింహారెడ్డికి 270 ఇస్తే.. విజయ్ డబ్బింగ్ మూవీ వారసుడుకు 300 + స్క్రీన్లు ఇచ్చారు.
అసలు వారసుడు సినిమాకు తెలుగులో మంచి టాకే లేదు. ఈ సినిమాపై ఉన్న హైప్‌కు, పెట్టిన పెట్టుబడికి.. వచ్చిన టాక్‌కు, కలెక్షన్లకు పొంతనే లేదు. వీరసింహా ఏపీ, తెలంగాణలో ఫుల్ స్వింగ్‌లో ఉంటే.. ఆ సినిమాకు కాదని వారసుడికే ఎక్కువ షోలు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. వారసుడు, వీరసింహా ఆడుతోన్న థియేటర్లలో ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్ చూస్తే ఏ సినిమాకు ఎక్కువ టిక్కెట్లు తెగుతున్నాయో క్లీయర్‌గా తెలుస్తోంది.
అయినా కావాలనే వీరసింహాకు షోలు తగ్గించేస్తూ… వీరయ్య, వారసుడికి పెంచేస్తున్నారని అంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు తమ అభిమాన హీరో సినిమా విషయంలో కావాలనే కుట్ర చేస్తున్నారంటూ మరోసారి దిల్ రాజుపై మండిపడుతున్నారు.. మరి అసలు ఏం జరుగుతుందో ? రాజుకే తెలియాలి.