సాధారణంగా.. తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్ డైలాగులు పెరిగిపోతున్నాయనే ఆవేదన ఎప్పటి నుంచో వినిపి స్తోంది. ఇప్పుడు నడుస్తోందంటే టెంగ్లీష్. అంటే తెలుగును, ఇంగ్లీష్‌ను మిక్స్ చేసి నడిపేస్తున్నారు. తెలుగు భాషలోకి ఇంగ్లీష్ పదాలు రావడంతో తెలుగు అనేది ఖూనీ అయిపోతోంది. తెలుగులో చాలా మంచి పదాలు కనుమరుగు అయిపోతున్నాయి.
భాషాభిమానులు సైతం ఇలా చేయడం తగదని అనేక సందర్భాల్లో పేర్కొంటూనే ఉన్నారు. కానీ, కాలాని అనుగుణంగా మార్పులు చేస్తున్నామని దర్శకులు చెబుతున్నారు. సరే.. ఈ వివాదం ఎలా ? ఉన్నా.. అన్నగారు ఎన్టీఆర్ నటించిన క్లాస్, మాస్ మూవీల్లో ఆయన తెలుగుకే పెద్దపీట వేశారు. “ఏవండీ.. ఇక్కడ తెలుగు వాడితే.. పోయేదేమైనా ఉందా!“ అని సెట్‌లో డైలాగులు మార్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
ముఖ్యంగా మాస్ సినిమాల్లో ఇంగ్లీషు పదాలు వినియోగించడం.. సహజం. హీరో ఆవేశానికి, ఆగ్రహానికి గురైనప్పుడు.. అలవోకగా ఇంగ్లీషు పదాలు నోటి వెంట వచ్చేస్తుంటాయి. అయితే.. అది ఎవరి విషయంలోనో అయితే, కావొచ్చు కానీ సీనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం కాదు. ఎందుకంటే.. ఆయన అలాంటి సీరియస్ సీన్‌లోనూ.. తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎంత సీరియస్ డైలాగ్ అయినా కూడా తెలుగులోనే ఉండాలని పట్టుబట్టేవారట.
అంతేకాదు.. అచ్చ తెలుగు ఉచ్ఛారణకు కూడా ప్రాధాన్యం ఉండేది. ఎవరో ఏదో చేశారని. ఏదో రాశారని తెలుగును అవమానించడం ఎందుకు.. అవకాశం ఉన్నంత వరకు తెలుగును వాడుకుందాం. ఇది తెలుగు సినిమానేతప్ప.. మిక్స్‌డ్ (భాషల కలబోత సినిమా) కాదుగా! అని వాదించేవారట. అందుకే.. ఇప్పటికీ తెలుగుకు పెద్దపీట వేసిన నటులుగా, రాజకీయ నాయకుడిగా అన్నగారు చిరస్థాయిగా నిలిచిపోయారు.