సంక్రాంతి బరిలో బాలయ్య వీరసింహారెడ్డి సినిమా దిగి విజయం సాధించింది. ఈ సినిమాకు పోటీగా పెద్ద సినిమాలతో పాటు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే సినిమా హిట్ అయినా కొన్ని విషయాల్లో అన్యాయం జరిగింది అంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఓ అభిమాని ఆవేదనతో రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ లేఖ సారాసంశం ఇది.
నందమూరి బాలకృష్ణ గారికి అభిమానిగా రాస్తున్న లేఖ
బాలయ్య అంటే… నా చిన్నప్పటి అంటే సినిమా అనేది ఒకటి ఉంటుందని తెలిసిన నాటి నుంచి గుడ్డిగా అభిమానించింది మిమ్మల్నే. సామాజిక మాధ్యమాలు వచ్చే వరకూ నాకు మీ వ్యక్తిత్వంపై ఏ విధమైన అవగాహన లేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో మీ మంచితనం, భోళాతనం, సహాయం చేసే తత్వం గురించి సాక్ష్యాలతో సహా చూసిన తర్వాత మీపై అభిమానం రెట్టింపు అయింది. మీ సినిమా అంటే మాకు మోజు… మీపై ఉన్న అభిమానాన్ని కులం ఆధారంగా వేరే వాళ్ళు మాట్లాడుతున్నా సరే మేం బాధ పడలేదు.
ఒక అభిమానిగా మీలో ఏ రోజు లోపాలు చూడలేదు. ఎందుకంటే మీరు మా పరువు, పరపతి, గౌరవం, ధైర్యం, నమ్మకం, భరోసా, పొగరు, బలం. కానీ ఈ రోజు మీ మంచితనంలో, మీ పద్దతిలో ఒక విధానం మారాలని నేను గమనించాను. అదేంటంటే… సినిమా ప్రమోషన్ విషయంలో అభిమానులను నమ్మారు, ఒక్క ట్రైలర్‌తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ కాలానికి అణుగుణంగా మీరు కుట్రలని ఎదుర్కోవడానికి మీరు సిద్ధం కాలేదనేది నా అభిప్రాయం.
మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్న అభిమానులు సినిమాను భుజాన మోసారు… కానీ థియేటర్లు లాక్కుంటుంటే మేం ఏం చేయలేకపోయాం అనే బాధ మాలో ఉంది. మాఫియా అంత తెగించి ఫ్యామిలీలు చూసే థియేటర్లు లాక్కుంటే మాకు ఏం చెయ్యాలో ? తెలియలేదు. అఖండ సినిమా కంటే ఈ సినిమాకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో కూడా సినిమాకు వచ్చిన స్పందన చాలా మందిని భయపెట్టింది. రాయలసీమలో నాలుగవ రోజు సినిమా చూడటానికి వయసు పైబడిన అభిమానులు కూడా పోటీ పడి వచ్చారు. కర్ణాటకలో కూడా సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.
బెజవాడ అలంకార్ థియేటర్లో ఆరో రోజు కూడా హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. అసలు బెజవాడలో సరైన థియేటర్లు లేక అభిమానులు కూడా సినిమా చూడలేకపోయారు. సీడెడ్లోనూ ఇదే పరిస్థితి. థియేటర్ల వద్ద ఉన్న టికెట్ పోటీ చూసిన తర్వాత సెలవు రోజు సినిమా చూడాలి అనుకున్న మధ్య తరగతి కుటుంబం ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని చప్పబడింది. మీరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఉంటే మన సినిమా వసూళ్ళు 3 రోజులకు 130 కోట్లు ఉండేవి.
మొదటి రోజు రు. 54 కోట్లు వచ్చిన సినిమా వసూళ్ళు తర్వాత ఆ స్థాయిలో తగ్గాయి. సినిమాకు హిట్ టాక్ వచ్చినా సరే. మీ తర్వాతి సినిమాకు ఈ లోపాన్ని దాటాలని మనస్పూర్తిగా కోరుతున్నాను. నిర్మాణ సంస్థ మన సినిమాకు అన్యాయం చేసిందనే భావన నాలో ఉంది… అయినా మీరు వాళ్ళను గౌరవించారు. మీరు మా గౌరవం… వంద రోజుల సినిమా రోజులు కాదు, వంద కోట్ల సినిమా రోజులు. మన సినిమా సూపర్ హిట్ అయినా సినిమా చూడాలి అనుకున్న లక్షల మంది చూడలేదు. అభిమానిగా ఇది జీర్ణించుకోలేని విషయం.
ఇట్లు
గుళ్ళపల్లి వెంకట్రామయ్య.