టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు తమ సినిమాలతో ఒకేసారి పోటీపడితేనే బాక్సాఫీస్ వేడి మామూలుగా ఉండదు. అందులోనూ సంక్రాంతికి పోటీ అంటే రచ్చ రంబోలానే. 2001లో చిరు మృగరాజు, బాలయ్య నరసింహానాయుడుతో పోటీ పడ్డారు. చిరు సినిమా ప్లాప్.. నరసింహానాయుడు ఇండస్ట్రీ హిట్.
ఆ తర్వాత పదేళ్ల తర్వాత చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి 2017 సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలయ్య కూడా అదే సంక్రాంతికి తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో చిరు సినిమాతో పోటీ పడ్డారు. అప్పుడు ఇద్దరు హిట్లు కొట్టారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత అదే హీరోలు ఒకే హీరోయిన్‌తో సంక్రాంతికి తమ సినిమాలతో పోటీ పడుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇద్దరు హీరోల అభిమానుల సందడి మామూలుగా లేదు. ప్రి రిలీజ్ బజ్ మాత్రం వీరసింహాకే కాస్త ఎక్కువుగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్‌ల్లో దుమ్ము లేపుతోన్న బాలయ్య ఓవర్సీస్‌లో అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇటు యూకే బాక్సాఫీస్ దగ్గర కూడా సత్తా చాటుతున్నాడు.
తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా వీరసింహాకు ప్రి రిలీజ్ బజ్‌తో పాటు అడ్వాన్స్ బుకింగ్‌లు అదిరిపోతున్నాయి. అమెరికాలో ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసేసింది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందగా… ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతాన్ని అందించాడు.