ఇప్పుడంటే..క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసే మాజీ హీరోయిన్లకు పెద్దగా వాల్యూలేదు. పోనీ హీరోయిన్గా అయినా.. ఎక్కువకాలం ఫాంలో ఉండలేక పోతున్నారు. పోటీ, ప్రేక్షకుల అభిరుచి.. అన్నీ కూడా హీరోయిన్లకు అడ్డంకులుగానే ఉంటున్నాయి. ఒక్క సమంత, నయనతార, అనుష్క వంటి కొందరి విషయాన్ని మినహాయితే.. మిగిలిన వారంతా కూడా పదుల సంఖ్యలో సినిమాల్లోపే తెరమరుగు అయిపోయారు.
అయితే.. బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో హీరోయిన్లుగా అడుగు పెట్టిన చాలా మంది ఆర్టిస్టులు.. దర్శకులు, నిర్మాతల సూచనలతో అప్పట్లోనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించారు. నటన.. అంటే నటనే.. అది హీరోయిన్ అయితే ఏంటి.. హీరోయిన్ తల్లి అయితే ఏంటి? అని సవాలుగా తీసుకుని నటించిన వారు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో క్యారెక్టర్ పాత్రలకు కూడా నిడివి ఎక్కువగానే ఉండేది.
ఇప్పట్లా.. ఒకటి రెండు సీన్లకే వారిని పరిమితం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే.. కుటుంబ కథా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎక్కువగా డిమాండ్ ఉండేది. దీంతో హీరోయిన్‌గానే కొనసాగాలి.. అనే పంతం వారికి ఉండేది కాదు. తమ నటనకు దర్శకులు ఏ పాత్రలో పెద్దపీట వేస్తారని భావిస్తే.. ఆయా పాత్రలు తీసుకునేందుకు వెనుకాడేవారు కాదు.
ఉదాహరణకు సూర్యాకాంతం హీరోయిన్గా అడుగు పెట్టారు. కానీ, అనతి కాలంలో ఆమె అత్త, అమ్మ, అక్క పాత్రల్లో నటించారు. గీతాంజలి.. హీరోయిన్గా వచ్చారు. కానీ, సక్సెస్ రాకపోవడంతో సెకండ్ హీరోయిన్గా నటించారు. తర్వాత.. క్యారెక్టర్ పాత్రలు నటించి దుమ్మురేపారు. రావు బాలసరస్వతీ దేవి. ఈవిడ మూకీ సినిమాల రోజుల్లో పెద్ద హీరోయిన్. కానీ, కొద్దికాలానికే క్యారెక్ట ర్ ఆర్టిస్టుగా దూసుకుపోయారు.
కన్నాంబ చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె.. అనతి కాలంలోనే సొంత బ్యానర్ అయినా సరే.. క్యారెక్టర్ పాత్రకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. వీరంతా ఆర్టిస్టులే కాదు.. ఆర్థికంగా కూడా బాగా ఎదిగి.. ఎందరికో దారి చూపించారు.