సినీ రంగంలో ఎన్టీఆర్ శైలి చాలా వినూత్నంగా ఉండేది. ఆయన చాలా మందితో అనుబంధం పెంచుకు న్నారు. అలనాటి కారెక్టర్ నటులు.. చిత్తూరు వీ. నాగయ్యను నాన్న గారు అని సంబోధించేవారు. ఆయనతో అవ్యాజమైన ప్రేమను పెంచుకున్నారు. అనేక రూపాల్లో ఆయనతో కలిసి తెరను కూడా పంచుకున్నారు. నాగయ్య అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్, ఆ తర్వాత ఏఎన్నార్‌కు కూడా నాగయ్య గురువుగా ఉండేవారని అంటారు.
ఇదే సమయంలో అన్నగారు అమ్మ తర్వాత అమ్మగా చూసుకున్న మరో మహానటి కూడా ఉన్నారు. ఆవిడే పండరీబాయి. ఒకప్పటి హీరోయిన్. అయితే, అన్నగారు చిత్రసీమలోకి అడుగు పెట్టేసరికే.. ఆమె తల్లి, చెల్లి పాత్రలు ధరించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అన్నగారితో ఆమె దాదాపు 30 సినిమాల్లో తల్లిపాత్రలే వేశారు. రామారావుకు తల్లిగా ఆమె నటించారు.
పాతాళ భైరవిలో తల్లీ కొడుకులుగా వీరిద్దరి నటన నిజమైన తల్లికొడుకులను సైతం మరపించేలా ఉంటుంది. అసలు అమాయకపు కొడుకు పాత్రలో ఎన్టీఆర్ నటించగా.. తన కొడుకు ఏమైపోయాడో అని తల్లడిల్లిపోయే తల్లి పాత్రలో పండరీబాయ్ అద్భుతంగా నటించారు. ఆ ఒక్కటే కాదు.. తర్వాత కాలంలో గజదొంగ వంటి మాస్ సినిమాలోనూ అన్నగారికి ఆమె తల్లిగా నటించా రు.
ఇలా.. అనేక సినిమాల్లో ఇద్దరి మధ్య తల్లి కొడుకుల అనుబంధం పెరిగింది. దీంతో పండరీబాయిని అన్నగారు.. అమ్మ .. అమ్మ .. అనే సంబోధించేవారని.. గుమ్మడి తెలిపారు. కొన్నిచిత్రాల్లో అత్త పాత్రలు కూడా పండరీబాయి వేశారు. అయినా.. కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత.. అమ్మ అనే పిలిచేవారని.. అలా అనుంబంధం పెంచుకున్నారని గుమ్మడి తెలిపారు.