సీనియర్ నటుడు చలపతిరావు మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా ఆయన వార్తలే కనిపిస్తున్నాయి. 8 దశాబ్దాల వయసు ఉన్న చలపతిరావుకు టాలీవుడ్తో ఏకంగా ఆరు దశాబ్దాల అనుబంధం ఉంది. మూడు తరాలకు చెందిన నటులతో కలిసి ఆయన నటించడం అంటే ఎంతో గొప్ప విషయం. ఇప్పుడు ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.
చలపతిరావుకు ఎన్టీఆర్ గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. నాటక రంగంలో ఉన్న చలపతిరావును ఎన్టీఆర్ ప్రోత్సహించి సినిమాల్లోకి వచ్చేలా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్వయంగా ఎన్నో అవకాశాలు ఇవ్వడంతో.. చలపతిరావు వాటిని ప్రూవ్ చేసుకొని స్టార్ నటుడిగా ఎదిగారు. ఇదిలా ఉంటే చలపతిరావు ఎన్నో విషయాల్లో ఇండస్ట్రీలో ఎంతోమందికి సాయం చేశారు.
దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ వివాహాన్ని చలపతిరావు దగ్గరుండి మరి చేశారు. ఈవివి కుటుంబానికి చలపతిరావుకు ఎంతో అనుబంధం ఉండేది. ఈవివి రెండో కొడుకు నరేష్ ని చలపతిరావు కొడుకు రఘుబాబు తన అల్లరి సినిమాతో హీరోగా పరిచయం చేశాడు. ఇక ఈవీవీ పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ కు ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగాక వెంటనే ఈవీవీ కన్నుమూశారు.
ఆ సమయంలో ఆ అమ్మాయితో రాజేష్ పెళ్లి జరుగుతుందా లేదా ? అన్న సందిగ్ధత నెలకొంది. అయితే అప్పుడు చలపతిరావు అన్నీ తానై వ్యవహరించి కొన్ని నెలల తర్వాత అదే అమ్మాయితో రాజేష్ కు దగ్గరుండి మరి వివాహం జరిపించారు. రాజేష్ భార్య సుభాషిణి ఎవరో కాదు. ఈవీవీ స్నేహితుడు కుమార్తె. 2011 జనవరి 5 న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ జరిగిన వారానికే జనవరి 11న ఈవీవీ మృతి చెందారు.
ఆ మరుసటి యేడాది 2012 ఫిబ్రవరి 12న ఆర్యన్ రాజేష్ పెళ్లి జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే ఈవివి మృతి చెందడంతో పలువురు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అసలు పెళ్లి జరుగుతుందా లేదా అన్న సందేహాలు రాగా… చలపతిరావు అటు పెళ్లికూతురు తరపువాళ్లతో… ఇటు ఈవీవీ కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ యేడాది తర్వాత ఈ పెళ్లి దగ్గరుండి మరి చేయించారు.