Moviesబాలయ్య - విజయశాంతి మధ్య గ్యాప్‌కు కారణం అదే... అంత జ‌రిగినా...

బాలయ్య – విజయశాంతి మధ్య గ్యాప్‌కు కారణం అదే… అంత జ‌రిగినా బాల‌య్య‌పై ఆమెకు ప్రేమ త‌గ్గ‌లేదా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ కు రెండున్నర దశాబ్దాల క్రితం తిరుగులేని క్రేజ్ ఉండేది. వీరిద్దరూ కలిసి సినిమా చేశారంటే థియేటర్లలో మాస్ ప్రేక్షకులు సినిమాను ఎంతలా ఎంజాయ్ చేశారో చెప్పక్కర్లేదు. బాలయ్య తన కెరీర్ లోనే ఎక్కువ సినిమాలు విజయశాంతితో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ముద్దుల మామయ్య, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పురవ్వ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్‌బ్‌స్టర్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి.

బాలయ్య- విజయశాంతి సినిమాలలో వీరిద్దరి మధ్య డైలాగులు… ఢీ అంటే ఢీ అనేలా నటన ఇవన్నీ అప్పట్లో ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసాయి. ఇక వీరిద్దరూ కలిసి ”బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య” ”జయమ్మ గుండెల్లో జయమ్మ” అనే పాటేసుకుంటే ఆ మజాయే వేరుగా ఉండేది. విజయశాంతి అంటే బాలయ్యకు ఎంతో ఇష్టం. అలాగే బాలయ్య అన్నా విజయశాంతి ప్రాణం ఇచ్చేది. వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. విజయశాంతికి చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చినా.. ముందు ఆమె స్టార్ హీరోయిన్ అవటానికి మాత్రం బాలయ్య సినిమాలే కారణమయ్యాయని చెప్పాలి.

అందుకే విజయశాంతికి బాలయ్య అంటే వల్లమాలిన అభిమానం. బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేశాక విజయశాంతి- చిరంజీవితో వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్న టాక్ ఉంది. ఆ తర్వాత విజయశాంతి నిర్మాతగా… బాలయ్య హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పురవ్వ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలకు పైగా జరుపుకుంది. షూటింగ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

బడ్జెట్ కంట్రోల్ తప్పి ఎక్కువ అయింది.ఈ సినిమాకు విజ‌య‌శాంతే పెట్టుబ‌డి పెట్టింది. విచిత్రంగా నిప్పురవ్వ, బాలయ్య నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. బంగారు బుల్లోడు సూపర్ హిట్ అవ్వగా… నిప్పురవ్వ అంచనాలు అందుకోలేకపోయింది. ఆ సమయంలో బాలయ్య జోక్యం చేసుకొని ఉంటే… బంగారు బుల్లోడును కాస్త ఆలస్యంగా రిలీజ్ చేసే వార‌ని విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అప్పటి నుంచి బాలయ్య- విజయశాంతి మధ్య మాటలు లేవని అంటారు.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో నిప్పురవ్వ చివరి సినిమాగా నిలిచిపోయింది. అయితే బాలయ్య అంటే విజయశాంతికి ఇప్పటికీ వల్లమాలిన అభిమానం ఉందని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. విజయశాంతి భర్త కూడా బాలయ్యకు సన్నిహితుడు… సమీప బంధువు అని అంటారు. విజయశాంతి ఇప్పుడైనా బాలయ్యకు జోడిగా నటిస్తే ఖచ్చితంగా అది సెన్సేషనల్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా చూస్తామా లేదా అన్న ప్రశ్నకు కాల‌మే సమాధానం చెప్పాలి.-

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news