టాలీవుడ్ యంగ్‌టైగర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నా అతడి గురించి రాజకీయ ప్రస్తావన కూడా వస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకండా ఆరు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ యేడాది వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. పాన్ ఇండియా హిట్ కొట్టిన త్రిబుల్ ఆర్ జపాన్‌లోనూ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉంటున్నాం.
ఇక ఎన్టీఆర్ చిన్న వయస్సులోనే సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా ఎలా ఎదిగాడో ? రాజకీయాల్లోకి కూడా వచ్చి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ఎంతలా హైలెట్ అయ్యాయో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత రాజకీయంగా ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తన సోదరి సుహాసిని పోటీ చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగానే ఉన్నారు.
అయితే ఇప్పుడు మళ్లీ రాజకీయంగా ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. ఈ సారి ఓ తెలంగాణ మంత్రి ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఆయనే ఎర్రబెల్లి దయాకర్‌రావు. తాజాగా ఖమ్మంలో చంద్రబాబు సభ పెట్టడంపై స్పందించిన ఎర్రబెల్లి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని.. ఎన్టీఆర్‌దే అన్న ఆయన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చెప్పారు.
తెలుగుదేశం అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉంటే బాగుంటుందని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని కూడా ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తెలుగుదేశంపై ప్రేమ ఉంటే ఎన్టీఆర్‌ను తీసుకువచ్చి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఏదేమైనా ఎర్రబెల్లి ఏపీ సీఎంగా ఎన్టీఆర్ ఉంటే బాగుంటుందని ప్రజల ఆకాంక్ష అని చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది.