అక్కినేని నాగేశ్వరరావు – జమున కాంబినేషన్ సూపర్ హిట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇది మూగమనసులు సినిమాకు ముందు అయితే కాదు. కానీ, మూగమనసులు సినిమాకు ముందు కూడా ఇద్దరూ కలిసి రెండు చిత్రాల్లో నటించారు. కానీ, అవి పెద్దగా పేరు తీసుకురాలేదు. మూగమనసులు సినిమాలో వీరిద్దరి మధ్య ఉండే కాంబినేషన్ బాగా వర్కవుట్ అయింది.
అమాయకపు మరదలిగా.. అక్కినేని ఆటపట్టించే సన్నివేశాలు… చివరకు అక్కినేనినే పెళ్లి చేసుకుంటానని చెప్పే సీన్లు బాగా పండాయి. ఈ సినిమా తర్వాత.. కొన్ని ఆఫర్లు వీరికే వచ్చాయి. అయితే, అక్కినేని బిజీగా ఉండడం.. జమునతో కలసి నటించే పరిస్థితి రాలేదు. దీంతో ఆల్టర్నేట్గా ఎన్టీఆర్ను తీసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. గులేబకావళి కథ ఇలా వచ్చిందేనని అంటారు.
ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత.. జమున-అక్కినేని కాంబినేషన్ అనే ముద్ర చెరిగిపోయి.. జమున ఎవరితో అయినా అద్భుతంగా నటిస్తుందనే పేరు తెచ్చుకుంది. అయతే, ఈ విషయంలో జమున ఎప్పుడూ బాధపడలేదట. తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండానే ఆమె సినిమాల్లో దూసుకుపోయింది. మూడునెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్గా అప్పట్లో పేరు తెచ్చుకున్నారు జమున.
దీనికి కారణం సినిమాలపై ఆమెకు ఉన్న అంకిత భావమేనని చెబుతారు. అయితే.. ఎన్ని సినిమాల్లో నటించినా.. ఆమెకు ఇప్పటికీ ఆశించిన గుర్తింపు అయితే రాలేదని సినీ వర్గాలు అంటుంటాయి. ఇంకోవిషయం ఏంటంటే.. జమున సినిమాలు తీయలేదు కానీ, ఒకటిరెండు చిత్రాలకు సహ నిర్మాతగా ఉన్నారు. గొప్ప గాయకురాలు కూడా. కొన్నాళ్లు చెన్నైలో డ్యాన్స్ ఇనిస్టిట్యూట్ కూడా నడిపించారు. ఎనో బహుముఖ కోణాలు ఆమెలో ఉన్నాయని అప్పట్లో చర్చించుకునేవారు.