సినిమావాళ్ల జీవితాలు బయటకు కలర్ ఫుల్ గా కనిపిస్తుంటాయి కానీ వారి జీవితాలలోనూ ఎన్నో కష్టనష్టాలు..సుఖఃదుఃఖాలు ఉంటాయి. అలాంటి కష్టాలే ఓబేబీ సినిమా నటి లక్ష్మి జీవితంలో కూడా ఉన్నాయి. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బేబీ పాత్రలో నటించిన లక్ష్మి అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మి అసలుపేరు ఎర్రగుడిపాడి వెంకట మహాలక్ష్మి. పదిహేనేళ్ల వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి డెబ్బై ఏళ్లు దగ్గరికి వస్తున్నా తన నటప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
తెలుగుతో పాటూ తమిళ, మలయాళ చిత్రాలలో నటించిన లక్ష్మి తన కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఉత్తమనటిగా ఏకంగా ఏడు సార్లు లక్ష్మీ ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకూ లక్ష్మీ వందల సినిమాలలో నటించి తన నటనతో మెప్పించారు. సమంతతో ఓ బేబీ సినిమాలో ఎంతో చురుకుగా నటించి ప్రేక్షకులను షాక్ కు గురి చేశారు. ఈ సినిమాలో సమంత తరవాత మళ్లీ లక్ష్మీ నటన సినిమాకు ప్రాణం పోసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతే కాకుండా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు జోడీగా మిథునం అనే సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఇలా లక్ష్మీ పారితోషికం తక్కువ అయినప్పటికీ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించి తన నటనను నిరూపించుకున్నారు. దర్శకులు సైతం లక్ష్మీ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతుంటారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా ఆమె నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే లక్ష్మీ నిజ జీవితం కూడా ఆశ్చర్యపోయేలా ఉంటుంది.
లక్ష్మీకి పదిహేనేళ్ల వయసులోనే భాస్కర్ అనే వ్యక్తితో ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఇద్దరి మధ్య వివాదాలు రావడంతో కేవలం పెళ్లైన ఐదేళ్లకే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత మలయాళ నటుడు మోహన్ శర్మతో ప్రేమలో పడి ఆయనను వివాహం చేసుకున్నారు. కానీ మోహనశర్మ 1980లో లక్ష్మీకి విడాకులు ఇచ్చారు. మళ్లీ ఏడేళ్ల తరవాత శివచంద్రన్ అనే నటుడిని లక్ష్మీ పెళ్లి చేసుకున్నారు. ఇక మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెనక అసలు కారణం ఏంటని ప్రశ్నిస్తే మగాళ్ల గర్వం..అధికారతత్వం అని ఆమె సమాధానం ఇస్తుంటారు.