తెలుగు సినీ రంగంలో అనేక మంది నటీమణులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడంటే.. ఒకటి రెండు సినిమాలకే పరిమితమైన నటీమణులు కనిపిస్తున్నారుకానీ, గతంలో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అయితే.. ఒకే హీరోయిన్ – ఒకే హీరో కలిసి వందల సినిమాలు తీసిన చరిత్ర తెలుగు తెరలు సొంత చేసుకున్నాయి. ఇలా నటించిన వారిలో చాలా మంది అగ్ర హీరోయిన్లు ఉన్నారు. ఒక్కసారి స్క్రీన్ టెస్టులో ఓకే అంటే.. ఇక, వారి జీవితాలు స్థిరపడిపోయినట్టే అని భావించే దర్శకులు కూడా ఇలానే ఉండేవారు.
ఇలా పైకి వచ్చిన వారే.. మహానటి సావిత్రి – అంజలీదేవి – భానుమతి – శ్రీరంజని – జమున – కృష్ణకుమారి – కేఆర్ విజయ – జయలలిత వంటి వారు. వీరితో పాటు ఇంకా కొందరు ఉన్నప్పటికీ.. వీరికి ఉన్న స్థానం వేరు. అందుకే వీరి కాల్షీట్లు దొరకడం అంటే.. అప్పట్లో నిర్మాతలు పండగ చేసుకునేవారు. ఈ హీరోయిన్లకు అప్పట్లో హీరోలతో సరి సమానమైన క్రేజ్ ఉండేది. ఈ హీరోయిన్లు అందరూ అప్పట్లో అన్నగారు ఎన్టీఆర్ వీరితో అనేక సినిమాల్లో కలిసి తెర పంచుకున్నారు.
అప్పట్లో ఒక దర్శకుడు.. నిర్మాత వీరందిరితోనూ కలిసి సినిమాలు తీశారు. ఒకే బ్యానర్‌పై వీరితో సాంఘిక, జానపద చిత్రాలను తీశారు. అనంతర కాలంలో ఇండస్ట్రీ హైదరాబాద్‌కు తరలి వెళ్లిపోతున్న కొత్తలోవీరిని అభినందించేందుకు ఒక కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి అన్నగారు ఎన్టీఆర్, అప్పటి అందాల రాముడు అక్కినేని నాగేశ్వరరావును పిలిచారు. ఈ సందర్భంగా అన్నగారు.. ఈ నటీమణులను గురించి చేసిన వ్యాఖ్య.. అప్పట్లో ప్రముఖంగా వినిపించింది.
ఒకప్పటి విజయనగర సామ్రాజ్యంలో అష్టదిగ్గజ కవులు ఉన్నట్టుగానే ఇప్పుడు తమిళ, తెలుగు సినిమా లకు అష్టదిగ్గజ నటీమణులు దొరికారని.. వీరికీర్తి తెలుగ, తమిళ భాషలు ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉండిపోతుందని వ్యాఖ్యానించారు. అన్నగారు ఏ ఉద్దశంతో అన్నారో కానీ, ఈ మాట ఇప్పటికీ నిలిచిపోయింది.