సాధారణంగా.. రెండు గంటల సినిమాను తీయాలంటే.. ఇప్పుడున్న టెక్నాలజీ… ఇప్పుడున్న స్టూడియోలు.. సౌకర్యాల వంటివాటితో పోల్చుకుంటే ఎంత లేదన్నా.. మూడు నుంచి నాలుగు మాసాల సమయం పడుతోంది. పోనీ.. తొందరపడి తీసినా.. రెండు నెలలు గ్యారెంటీ. అలాంటిది.. నాలుగు గంటల నిడివి ఉన్న(3గంటల 56 నిమిషాలు) ఒకసినిమాను తీయాలంటే.. ఎంత సమయం పడుతుంది? ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఏడాదిన్నర లేదా ఏడాది సమయం పడుతుంది.
అందులో పెద్ద హీరోలు, భారీ బడ్జెట్, ఏ రాజమౌళి లాంటి దర్శకుడు తెరకెక్కించే విజువల్ వండర్ అంటే కనీసం రెండేళ్లకు పైగానే టైం పడుతుంది. కానీ, అన్నగారు మాత్రం ఇంత పెద్ద సినిమాను కేవలం 43 రోజుల్లో తీసేయడం రికార్డు. ఈ రికార్డును ఇప్పటి వరకు చెరిపివేయ లేకపోయారంటే కూడా అతిశయోక్తి కాదు. ఈ 43 రోజులు కూడా కేవలం షూటింగ్ కు సంబంధించిన రోజులు. అంటే ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్.. వంటివి వేరే.
కానీ, షూటింగైనా 4 గంటల సినిమాకు 43 రోజుల్లో సాధ్యమేనా ? అంటే.. సాధ్యమనే నిరూపించారు అన్నగారు. అదే .. సూపర్ డూపర్ హిట్టయిన.. “దాన వీర శూరకర్ణ“ ఈ సినిమాను అన్నగారు 1977లో జనవరి 14న సంక్రాంతి కానుకగా తెలుగు ప్రజలకు అందించారు. నిజానికి అప్పటి వరకు ఎంత పౌరాణికమైనా.. జానపదమైనా.. ఇంత భారీస్థాయిలో 4 గంటలపాటు నిడివి ఉన్న సినిమాలు ఎవరూ తీయలేదు. కానీ, అన్నగారు మాత్రం సాహసం చేశారు.
ఆ సమయంలో ఒకరిద్దరు.. ఇంత పెద్ద సినిమా హిట్ కొట్టడం కష్టం అన్నారు. “ఆడడం కోసం డబ్బులు సంపాయించడం కోసం.. కాదు, మన మహాభారతంలో మరుగున పడిన ఒక చైతన్య శిల్పాన్ని(కర్ణుడు) వెలుగులోకి తీసుకురావాలనే నా అభిలాష“ అని చెప్పారు. నిజానికి అప్పటికే పాత సినిమాల రోజుల్లోనే కర్ణ అనే సినిమా వచ్చింది. అయితే, అన్నగారు మరిన్ని మేళవింపులు చేసి.. దీనిని సొంతగానే నిర్ణించారు. దీనిలో అనేక ప్రయోగాలు చేశారు. మూడు పాత్రలు తనే ధరించారు. దుర్యోధనుడు, కర్ణుడు, కృష్ణుడు. ఇక, తన ఇద్దరు కుమారుడు బాలయ్య, హరికృష్ణలను కూడా నటించేలా చేశారు.
ఇక, మరీ ముఖ్యమైన విషయం.. సినిమా పొడ గిట్టని తిరుపతి వెంకట కవులతో స్క్రిప్టు సిద్ధం చేయించారు. ఇక, రూ.10 లక్షలకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాకుండా.. తొలిరోజు ఎంత నిర్ణయించుకున్నారో.. అంతే బడ్జెట్‌లో నిర్మించారు. ఇక, ఈ సినిమా.. రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది. పైగా.. 4 గంటల సినిమాను ఎలాంటి బోర్ కొట్టకుండా ప్రజలు వీక్షించారు. దటీజ్ అన్నగారు. భారతదేశంలోనే అతి పొడవైన సినిమాగా కర్ణ ఇప్పటకీ చెక్కు చెదరని రికార్డు సొంతం చేసుకుంది. రీ రిలీజ్‌లో కూడా వంద రోజులు ఆడిన సినిమాగా కర్ణ రికార్డులకు ఎక్కింది.