తెలుగు నేల ఉన్నంత వరకు గుర్తుండే నటనా మూర్తి అక్కినేని నాగేశ్వరరావు, విశ్వవిఖ్యాత నటసార్వభౌ ముడు, తెలుగు వారి అన్నగారు ఎన్టీఆర్ కలిసి అనేక సినిమాల్లో నటించారు. ఏ చిత్రానికి ఆ చిత్రం స్పెషల్. ఎంతగా కలిసి మెలిసి తిరిగినా.. ఎంత ఒకే జిల్లాకు చెందిన వారైనా కూడా.. వ్యక్తిగత జీవితాలు, అలవాట్ల విషయానికి వస్తే మాత్రం ఎన్టీఆర్ – ఏఎన్నార్ రూట్లు కలవలేదు. అన్నగారు.. రాజకీయ బాట పట్టారు.
కానీ, నాగేశ్వరరావు.. సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. అన్నగారు చరమాంకంలో తీవ్ర ఆవేద న, ఆందోళనకు గురయ్యారు (ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు). అదే అక్కినేని కుటుంబ సభ్యుల తో ఆనందగా గడుపుతూ.. తాను త్వరలోనే వెళ్లిపోతానంటూ.. మీడియాను పిలిచి మరీ చెప్పి.. ప్రశాంతంగా కన్ను మూశారు. అయితే.. ఈ ఇద్దరు మహానటులు ఈ తెలుగు నేలను ఉద్ధరించారు. తెలుగు తెరను పునీతం చేశారు.
అయితే.. ఇరువురి మనసులు కలవకపోయినా.. వీరిని గుర్తించి.. వీరి మనసులను కలిపింది… కేంద్ర ప్రభుత్వం! ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఇరువురి నటనా ప్రతిభను గుర్తించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం .. ఇద్దరు నటులకు ఒకేసారి `పద్మశ్రీ` అవార్డును ప్రకటించింది. 1968వ సంవత్సరంలో ఇద్దరికీ ఒకే విడతలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించడం గమనార్హం. ఈ విషయం తెలిసి.. అనేక మంది నటీనటులు వారిని విష్ చేశారు.
కట్ చేస్తే.. ఒకే వేదికపై ఒకే రాష్ట్రపతి చేతుల మీదుగా.. ఈ అవార్డును అప్పటి రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వీరిద్దరినీ ఒకే విమానంలో పంపించాలని.. అప్పటి మహానటి సావిత్రి, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. గుమ్మడి వెంకటేశ్వరావు, ఎస్వీ రంగారావు వంటివారు ప్రయత్నించారు. సావిత్రి ఏకంగా ఢిల్లీ ఫ్లైట్‌కు మద్రాస్ నుంచి టికెట్‌లు కూడా బుక్ చేస్తానని చెప్పారు.
దీనికి గుమ్మడి కూడా సాయం చేస్తానని అన్నారు. కానీ, అప్పటికే అక్కినేని హైదరాబాద్‌కు వచ్చారు. అన్నగారు అప్పటికీ మద్రాస్‌లోనే ఉన్నారు దీంతో ఎవరికివారుగానే ఢిల్లీ వెళ్లినా.. ఒకరి తర్వాత ఒకరుగా ఒకే వేదికపై పద్మశ్రీ అందుకోవడం గమనార్హం. తెలుగు తెర చరిత్రలో ఇలా మళ్లీ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు.