1980 – 90వ దశకంలో శ్రీదేవి అంటే అదో పిచ్చ క్రేజ్. శ్రీదేవితో స్టార్ హీరో సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర ఎక్కడా లేని క్రేజ్ ఉండేది. తెలుగు జనాలు ఆమెను స్టార్ ను చేస్తే.. ఆ క్రేజ్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి. అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్ జనాల ఆరాధ్య దేవత అయిపోయింది. రెండు తరాలకు చెందిన హీరోలతో కూడా ఆమె కలిసి నటించింది. ఉదాహరణకు ఏఎన్నార్‌కు జోడీగా ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీదేవి.. ఆయన తనయుడు నాగార్జునతోనూ నటించింది.
అటు తండ్రి పక్కన, ఇటు కొడుకు పక్కన చేయడం… ఆ సినిమాలు జనాలు చూడడం అంటే ఏదోలా ఉంటుంది. కానీ శ్రీదేవి మాత్రం ఇద్దరి పక్కన కరెక్టుగా సెట్ అయ్యింది. 1970ల్లో కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మరో ట్విస్ట్ ఏంటంటే బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్‌కు మనవరాలిగా చేసిన శ్రీదేవి.. అదే ఎన్టీఆర్ పక్కన ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గాను చేసింది.
ఇక ఎన్టీఆర్‌తో చేసిన శ్రీదేవికి ఆయన తనయుడు బాలకృష్ణ పక్కన కూడా నటించే ఛాన్స్ వచ్చింది. అయితే రెండుసార్లూ కూడా ఎన్టీఆర్ ఇష్టపడకపోవడంతోనే ఈ అరుదైన కాంబినేషన్ మిస్ అయ్యింది. బాలయ్య సమకాలీన హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు పక్కన శ్రీదేవి జోడీ కట్టింది. అయితే బాలయ్యతో మాత్రం ఆమె నటించలేదు. అయితే రెండుసార్లు ఈ కాంబినేషన్ సెట్ అయ్యి.. క్యాన్సిల్ అయ్యింది.
1987లో రాఘవేంద్రరావు బాలయ్య – శ్రీదేవి కాంబోలో సామ్రాట్ సినిమా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్కే ఈ కాంబినేషన్ నచ్చలేదు. అలా ఫస్ట్ టైం వీరిద్దరు జంటగా రావాల్సిన సినిమా మిస్ అయ్యింది. ఆ తర్వాత 1989లో మరో స్టార్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి భలేదొంగ సినిమాలో బాలయ్య పక్కన శ్రీదేవిని నటింపజేయాలని.. వీరిద్దరి కాంబినేషన్ సెట్ చేయాలని ప్లాన్ చేశారు. కోదండరామిరెడ్డి అంటే శ్రీదేవికి కూడా ఇష్టమే. శ్రీదేవికి బాలయ్య పక్కన నటించడం ఇష్టమే అయినా.. అయితే కొందరు నందమూరి అభిమానులు ఈ ప్రయత్నానికి అడ్డుపడ్డారు.
శ్రీదేవి తండ్రితో పాటు కొడుకు పక్కన నటిస్తే బాగోదని ఎన్టీఆర్కే చెప్పడంతో మళ్లీ ఎన్టీఆర్ ఈ కాంబినేషన్‌కు అడ్డుపడ్డారు. అలా భలేదొంగలో శ్రీదేవి ప్లేసులో విజయశాంతిని తీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడూ బాలయ్య – శ్రీదేవి కాంబినేషన్ సెట్ చేసేందుకు ఎవ్వరూ ప్రయత్నాలు చేయలేదు.