ఒక జీవితం మూడు సినిమాలు
ఎవరి పంథా వారిదే ఎవరి పంతం వారిదే
ఎన్టీఆర్ అనే మూడక్షరాలు ఇప్పుడెందుకు సెన్సెషన్ అవుతున్నాయని
ఎందుకని ఈ మూడక్షరాల చుట్టూ రాజకీయం నడుస్తుందని
ప్రశ్న నుంచి ప్రశ్న వరకూ ఆలోచిద్దాం. ఓ సమాధానం వెతుకుదాం.ఆ ప్రయత్నమే ఈ వ్యాసం.
………………………………………………….
వర్మ ఎన్టీఆర్
తేజ ఎన్టీఆర్
ఇద్దరూ వేరు
వీరితో పాటు మరో ఎన్టీఆర్
ఆయన పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
తెలుంగులు కోసం తమిళ నాట కృషి చేసే వ్యక్తి
పంపిణీ దారులు అలానే ఓ తెలుగు సంఘం నిర్వాహకులు
చెన్నయ్ కేంద్రంగా పనిచేసే భాషాభిమాని
ఇప్పుడీయన కూడా ఓ బయో పిక్ తీస్తానంటున్నారు
టైటిల్ : లక్ష్మీస్ వీరగ్రంథం
ఇన్ని సినిమాల మధ్య నిజం ఎవరు చెబుతున్నారు
ఎవరు నుంచి ఎన్టీఆర్ ఆత్మ సాంత్వన కోరుకుంటున్నట్లు
ఎన్నికలకు ఏడాదిన్నర ఉందనగా ఎందుకీ డ్రామా
అంటే ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే అంతకుమించిన ప్రయోజనం వెతకరాదు
అంతకుమించి ఓ కొత్త కోణం వెతకరాదు అది తప్పు.. ఆ తప్పు విజ్ఞులైనవారెవ్వరూ చేయరు.
………………………………………………….
“నా అనుమతి లేనిదే చిత్రమా??”
ఈ నేపథ్యంలో..లక్ష్మీ పార్వతి పెదవి విప్పారు.జగదీశ్వర్ రెడ్డి తీయబోతున్న బయోపిక్ పై ఎన్టీఆర్ జీవన సహచరి లక్ష్మీ పార్వతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆమె ఏమన్నారంటే..”నా మనసుకు బాధ కలగడంతో సాంత్వన కోసం ఆయన సమాధి వద్దకు వచ్చాను. నా భర్త ఎన్టీఆర్ చివరి రోజుల్లో మానసిక క్షోభ అనుభవించా రు.ఆయన మరణం వెనుక దాగి ఉన్న నిజాలను వెలికి తీయాలని తాను చాలాకాలంగా పోరాడుతున్నాను. కానీ ఉన్నట్టుండి కొంతమంది వచ్చి తనను రచ్చకీడ్చాలనే ఉద్దేశంతో ఉన్నవి లేనివికల్పించి సినిమాలు తీయాలని భావిస్తున్నారు.నేను బ్రతికుండగా వారి ప్రయత్నాలు సాగవు. అవసరం అయితే నా ప్రాణం అడ్డుపెట్టయినా వాటిని అడ్డుకుంటాను. నాఅనుమతి లేకుండా తన వ్యక్తిగత జీవితంపై సినిమా తీస్తే చూస్తూ ఊరు కోను. రెండ్రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. నన్ను ఇబ్బంది పెట్టినా భరిస్తాను. కానీ నా భర్త పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లితే మాత్రం చూస్తూ ఊరుకోను. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిర్మించబోతున్న సినిమాకు నా అనుమతి తప్పని సరి. అనుమతి లేకుండా తీసే చిత్రం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనక తప్పదు. ఇంతవరకు లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రానికి సంబంధించి నా అనుమతి కోరుతూ ఎవరూ సంప్రదించలేదు” అని స్పష్టం చేశారామె.
………………………………………………….
తీవ్ర రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతున్న ఈ మూడు చిత్రాలులో ఏది ముందు ఏది తరువాత అన్నది అటుంచితే రానున్న కాలంలో లక్ష్మీ పార్వతి ఓ ప్రధాన ప్రతిపక్షం అండ తీసుకుని రోడ్డెక్కడం ఖాయం.అలానే ఎన్నికలు సమీపించే సమయంలోనే వర్మ చిత్రం కూడా విడుదలైతే
మరికొన్ని తగాదాలు వెల్లువెత్తడం తథ్యం. బాలయ్య – తేజ కాంబినేషన్ చిత్రం అంత సెన్సేషన్ కాకున్నా లక్ష్మీపార్వతి పాత్ర ఇందులో చూపిస్తారా లేదా అన్నది ఆసక్తిదాయం.చాలా రోజుల తరువాత రాష్ట్ర రాజకీయ నాయకులకు ఎన్టీఆర్ కావాల్సివచ్చాడన్నది నిష్ఠుర సత్యం. అనేకానేక వివా దాల నడుమ ముగిసిపోయిన ఆయన జీవితంపై ఓ చిత్రం సమగ్రంగా తెరకెక్కడం అన్నది సాధ్యం కాని పని! వర్మ అయినా తేజ అయినా ఆఖరికి జగదీశ్వర్ రెడ్డి అయినా ఎవ్వరైనా తమకు తెలిసిన యథార్థమిది అని చెబుతారు అని అనుకునే ఛాన్స్ తెలుగు ప్రజలకు ఇప్పట్లో అయితే లేదు గాక లేదు. రేపటి వేళ సీన్ లోకి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్లు, నందమూరి వంశానికే చెందిన ఇంకొందరు వస్తే మాత్రం వివాదం మరింత ముదిరిపాకాన పడుతుందన్నది అంగీకరించదగ్గ నిజం.వారు వస్తారో రారో అన్నది ఇప్పుడు ఆసక్తిదాయకం.
– రత్నకిశోర్ శంభుమహంతి