ఇటీవల టాలీవుడ్లో డబ్బింగ్ సినిమాల హవా నడుస్తోంది. అసలు కాంతారా ఇక్కడ ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేసిందో చూశాం. ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో హీరో ప్రదీప్ రంగనాథన్ నటించి స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా లవ్ టుడే. తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను పంపిణీ చేస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం.
కథ :
ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నిఖిత (ఇవానా) ఇద్దరు డీప్‌లవ్‌లో ఉండి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఈ ప్రేమ విషయం నిఖిత తండ్రి (సత్యరాజ్)కి తెలుస్తోంది. సత్యరాజ్ ప్రదీప్‌ను ఇంటికి పిలిచి వీరి పెళ్లికి కొన్ని కండీషన్లు పెడతాడు. ఇద్దరూ ఒక రోజు పాటు ఒకరి ఫోన్లు, మరొకరు మార్చుకోవాలని అంటాడు. ఆ ఫోన్లు మార్చుకున్నాక వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ? ఒకరి గురించి మరొకరికి ఎలాంటి నిజాలు తెలిశాయి. ఎలాంటి సమస్యలు వచ్చాయి ? చివరకు వీరి ప్రేమకథ ఎలా సుఖాంతం అయ్యిందన్నదే ఈ సినిమా స్టోరీ.
విశ్లేషణ :
జంటలు చిన్న చిన్న విషయాలకే అపోహలు పడి విడిపోతూ ఉన్న ఈ జనరేషన్లో దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ లవర్స్ మధ్య ఉండే మంచి ఎమోషన్‌ను చాలా చక్కగా, నీట్‌గా ప్రజెంట్ చేశాడు. ఆ పాత్రల మధ్యే కామెడీ, ఎమోషన్, అపార్థాలు, గొడవలు, ఆత్మాభిమానాలు చాలా బాగా ఎస్లాబ్లిష్ చేశాడు. సినిమాలో చాలా సీన్లు ఈ తరం సగటు కుర్రాళ్ల భావోద్వేగాలకు అద్దం పట్టాయి. ఈ తరం కుర్రాళ్లు సరదాల కోసం చాటుగా ఏం చేస్తారు ? బయట ఎలా కనిపిస్తారు ? అన్న కోణాలను కూడా దర్శకుడు బాగా చూపించాడు.
ప్రస్తుతం యువత ఫోన్‌కు ఎలా బానిస అవుతోంది ? ప్రేమ అంటే వారి దృష్టిలో అర్థం ఏంటి ? ఫోన్ ఎలా వాడుతున్నారు ? దాని వల్ల వచ్చే అనర్థాలు ఏంటి ? సోషల్ మీడియా వాడకం వల్ల చెడు ఎలా వ్యాప్తి చెందుతోందన్న అంశాలను దర్శకుడు స్పజించిన విధానం బాగుంది. సత్యరాజ్ ఎమోషనల్ ఎపిసోడ్ బాగుంది. హీరో ప్రదీప్ తనదైన కామెడీ టైమింగ్‌తో తన ఎమోషనల్ యాక్టింగ్‌తో బాగా నటించాడు. ఇక హీరోయిన్ ఇవానా కూడా చాలా బాగా నటించింది.
ఈ సినిమాకు యోగిబాబు కామెడీ చాలా ప్లస్ పాయింట్. మిగిలిన పాత్రల్లో రాధికా శరత్ కుమార్, సత్యరాజ్ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు మంచి లైన్ తీసుకున్నా కథనం చాలా చోట్ల సింపుల్‌గా వెళ్లిపోతూ ఉంటుంది. సెకండాఫ్‌లో చాలా చోట్ల స్క్రీన్‌ప్లేలో ఇంట్రస్టింగ్ మిస్ అయ్యింది. హీరో – హీరోయిన్ల లవ్‌స్టోరీలో కొన్ని సీన్లు రెగ్యులర్ డ్రామా స్టైల్లోనే ఉంటాయి. దర్శకుడు కమర్షియాలిటీ కోసం కొన్ని కామెడీ సీన్లు ఇరికించేశాడు.
టెక్నికల్‌గా ప్రదీప్ రంగనాథన్ మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అతడి టేకింగ్‌కు మంచి మార్కులు వేయాలి. స్క్రీన్ ప్లే కూడా చాలా వరకు ఇంట్రస్టింగ్‌గానే ఉంది. మ్యూజిక్‌లో పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్‌లో కొన్ని అనవసర సీన్లు, ఇరికించిన కామెడీ ట్రిమ్ చేస్తే బాగుండేది. సినిమాటోగ్రపీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా…
లవర్స్ మధ్య నిజమైన లవ్ , ట్రూ ఎమోషన్స్ గుర్తు చేసే నిజమైన లవ్ స్టోరీయే ఈ సినిమా. మంచి మెసేజ్, కుటుంబ విలువలు, ఎమోషనల్ టచ్చింగ్తో బాగుంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది.
లవ్‌టుడే రేటింగ్: 3 / 5