పాపం ఇటీవల కాలంలో అల్లరి నరేష్ కు సరైన హిట్ లేదు. ఇంకా చెప్పాలంటే నరేష్ హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. తాజాగా నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే కాస్త ప్రామిసింగ్ అనిపిస్తోంది. అయితే అల్లరి నరేష్ గత సినిమాలు అట్టర్ ప్లాప్ అవడంతో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరగలేదు.
అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తొలిరోజే నరేష్ మారేడుమిల్లి ప్రజానీకం సినిమాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. అసలే ఈ సినిమాను జనాలు పట్టించుకుంటారా లేదా ? అన్న సందేహాలు ఉన్నాయి. దీనికి తోడు ఈరోజే భారీ అంచనాలతో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి దిగుతున్నాయి. విచిత్రం ఏంటంటే నరేష్ సినిమాకు పోటీగా ఈ రెండు సినిమాలకు కూడా భారీ ఎత్తున థియేటర్లు కేటాయించారు.
దీంతో సోలోగా వచ్చి మంచి కలెక్షన్లు దక్కించుకోవాలని నరేష్ కన్న కలలు కలలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి. ఈరోజు థియేటర్లలోకి నరేష్ సినిమాతో పాటు లవ్ టుడే, తోడేలు సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలే. తెలుగులో డబ్బింగ్ సినిమాలు ఎంత సూపర్ హిట్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. తాజాగా కాంతారా తెలుగులో అయితే ప్రభంజనం క్రియేట్ చేసింది. ఆ రేంజ్ లో కాకపోయినా లవ్ టుడే ఓ మోమాస్తరుగా అయినా ఆడేలా ఉంది. పైగా ఇది యూత్ కు నచ్చే ప్రేమ కథ.
నైజాంలోనూ అటు వైజాగ్ లోను దిల్ రాజు తన థియేటర్లో అన్నింటిని లవ్ టుడే సినిమాకు కేటాయించేసుకున్నారు. ఇక్కడ నరేష్ కు పెద్ద దెబ్బ పడిపోయింది. అలాగే తోడేలు అనే మరో హిందీ డబ్బింగ్ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను అల్లు అరవింద్ స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. ఇటు దిల్ రాజు, అరవింద్ లాంటి ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్లు రెండు డబ్బింగ్ సినిమాలతో అల్లరి నరేష్ సినిమాను చుట్టుముట్టేశారు.
దీంతో నరేష్ సినిమాకు మంచి థియేటర్లు దక్కలేదు. పైగా ఈ రెండు డబ్బింగ్ సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. యూత్ కనుక ఆ సినిమాల వైపు మొగ్గుచూపితే అల్లరి నరేష్ తూర్పు తిరిగి దండం పెట్టుకుని దేవుడిని వేడుకోవడం తప్ప చేసేదేం ఉండదు.