ఒకే ఒక్క సినిమాతో ఆమె టాలీవుడ్‌ను షేక్ చేసి పడేసింది. ఆ సినిమాతో ఆమె అప్పట్లో స్టార్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించేసింది. ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుందనే అందరూ అనుకున్నారు. అయితే ఆ ఒక్క సినిమాతోనే ఆమె క్రేజ్ అంతా మాయమైపోయింది. తర్వాత రెండు, మూడు సినిమాలు చేసినా ఇండస్ట్రీ నుంచి అడ్రస్ లేకుండా పోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు. రెండు దశాబ్దాల క్రిందట వచ్చిన నువ్వేకావాలి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది రిచా.
ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు విజయ్ భాస్కర్ కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన రిచాకు ఆ సినిమాలో హీరో తరుణ్‌తో మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఆ సినిమా చాలా సెంటర్లలో యేడాది పాటు ఆడింది. ఆ తర్వాత మరోసారి తన తొలి హీరో తరుణ్‌తో చిరుజల్లు సినిమా చేస్తే డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత సీనియర్ హీరో శ్రీకాంత్‌తో నా మనసిస్తారా సినిమా చేసింది.
ఈ సినిమా కూడా ఆడలేదు. ఆ తర్వాత కూడా బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేసినా అవి సక్సెస్ కాకపోవడంతో రిచా కెరీర్ మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. ఈ క్రమంలోనే 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయ్యింది. ఆ తర్వాత 2016లో రీ ఎంట్రీ ఇచ్చి ఆది పినిశెట్టి మలుపు సినిమాలో చేసింది.
ఈ సినిమా తర్వాత మళ్లీ రిచా తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం రిచాకు ఓ బాబు కూడా ఉన్నాడు. ముంబైలోనే ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఏదేమైనా రిచా ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్‌లో యంగ్ హీరోలకు అక్కగా, వదినగా మంచి పాత్రలు వచ్చి చేస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుతున్నారు. మరి మన తెలుగు నిర్మాతలు, దర్శకులు రిచాను గుర్తు పెట్టుకుని ఛాన్సులు ఇస్తారేమో ? చూడాలి.