సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన తారలు అనేక మంది ఉన్నారు. అయితే.. అనంతర కాలంలో వారంతా.. తమ జల్సా ఖర్చుల వల్ల కావొచ్చు.. లేదా మరో వ్యసనాల వల్ల కావొచ్చు.. చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందు లు పడ్డారు. ఇలా.. అలనాటి మేటి నటీమణి పసుపులేటి కన్నాంబ కూడా ఇబ్బందులు పడ్డారు. కడారు నాగభూషణం అనే దర్శకుడిని వివాహం చేసుకున్న కన్నాంబ అనేక సినిమాల్లో రాణించారు. క్యారెక్టర్ ఆర్టిస్టే అయినా హీరోయిన్ స్థాయిలో చిత్రసీమలో ఎదిగారు.
సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త కడారు నాగభూషణం, ఇద్దరూ కలసి ‘ రాజరాజేశ్వరీ ‘ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.
అయితే.. చివరి దశలో అంతా పోగొట్టుకున్నారు. చివరకు.. ఉన్న కొద్దిపాటి ఆస్తులను వేలం వేసి.. ఆ సొమ్ముతో రోజులు గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే రాజరాజేశ్వరి చిత్ర నిర్మాణ సంస్థను కూడా వేలం వేశారు. దీనికి మద్రాస్‌కు చెందిన కొందరు నిర్మాతలు కలిసి సంయుక్తంగా కొనుగోలు చేశారు. అయితే, ఈ క్రమంలో వారు దీనిని ఎన్టీఆర్ కొనమన్నారు. అందుకే వేలంలో పాల్గొన్నాం అని చెప్పారు.
దీంతో ఎన్టీఆర్‌పై అభిమానంతో కన్నాంబ దంపతులు అతి తక్కువ ధరకే దీనిని సదరు నిర్మాతలకు అప్పగించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఎన్టీఆర్ ఈ విషయం తెలిసి.. కన్నాంబ దంపతులకు క్షమాపణలు చెప్పారట. అంతేకాదు.. అప్పటి ఎంజీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ.. కన్నాంబ దంపతులను మోసం చేసిన వారిపై కేసులు పెట్టించారట ఎన్టీఆర్.