ఛాయాదేవి, సూర్యాకాంతం.. ఇద్దరూ కూడా గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు. ఇద్దరూ కూడా ప్రతినాయిక పాత్రల్లో ఇట్టే ఇమిడి పోవడమే కాకుండా.. అసలు సినిమా చూస్తున్నంత సేపూ.. కన్ను తిప్పుకోకుండా నటించేవారు. ఎంత గయ్యాళిగా ఉన్నా.. ఇద్దరి కాంబినేషన్ మాత్రం సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే.. ఇద్దరూ కూడా వేర్వేరుగా సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు చాలా చాలా తక్కువ. అయితే, ఒకే ఒక్క సినిమాలో మాత్రం తొలిసారి ఇద్దరూ కలిసి నటించారు.
వాస్తవానికి ఈ సినిమాకు ఛాయాదేవి పాత్రలో కన్నాంబను తీసుకుందామని దర్శకుడు సిద్ధమయ్యాడు. కానీ, ఆ సమయానికి కన్నాంబ ఫుల్లు బిజీగా ఉంది. దీంతో షెడ్యూల్ విషయంపై చర్చ జరిగింది. అదే ఎన్టీఆర్, సావిత్రి నటించిన సూపర్ హిట్ మూవీ `గుండమ్మ కథ`. ఈ సినిమాలో సూర్యాకాంతానికి జోడీగా కన్నాంబ నటించాల్సి ఉంది. కానీ, ఆమె కాల్ షీట్లు ఖాళీగా లేకపోవడంతో అసలు ఆ క్యారెక్టర్‌ను రద్దు చేయాలని అనుకున్నారు. అయితే, అదే సమయంలో ఎన్టీఆర్ జోక్యం చేసుకుని ఛాయాదేవికి అవకాశం ఇవ్వాలని సూచించారు.
దీనికి నిర్మాత ముందు ఒప్పుకోలేదు. ఎందుకంటే.. హీరోల కన్నా కూడా ఛాయాదేవి తీసుకునే రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేదట. అయితే, ఎన్టీఆర్ మాత్రం పాత్ర బాగున్నప్పుడు.. ఇస్తే తప్పులేదులే అని ఒప్పించి మరీ ఛాయాదేవికి అవకాశం ఇచ్చారు. దీంతో తొలిసారి ఛాయాదేవి.. సూర్యాకాంతం కలిసి నటించే సీన్లు పండాయి. వాస్తవానికి దీనికి ముందు కూడా.. సూర్యాకాంతం-ఛాయాదేవిలు మాయాబజార్ సినిమాలో నటించారు.
కానీ, ఇద్దరు ఎదురు పడే సందర్భం ఆ సినిమాలో లేదు. దీంతో పట్టుబట్టి ఈ సినిమాలో అన్నగారు ఛాయాదేవికి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఈ ఇద్దరు ఎదురు పడే సందర్భాలు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు సూపర్‌గా ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ సినిమా ఎంత హిట్టయిందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు.