విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్.. అనేక చిత్రాలను వదులుకుని మరీ యంగ్ హీరోలకు అవకాశం ఇచ్చారు. అయితే.. ఒక సినిమా విషయంలో మాత్రం.. ఏకంగా తన కుమారుడు నందమూరి బాలయ్యకు అవకాశం వస్తే.. కాదని.. ఆయనను పక్కన పెట్టి మరీ..తనే ఆసినిమాలో హీరోగా నటించారు. ఇది కొంత చిత్రమైన విషయమే అయినా.. నిజం! ఓ సూపర్ హిట్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించడానికి ఎన్టీఆర్ నో చెప్పారట. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎందుకు అలా అన్నారంటే? పదండి.. చూద్దాం..
ఎన్టీఆర్ కథానాయకుడిగా 1977లో వచ్చిన ‘యమగోల’ అద్భుత విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి డి.వి.నరసరాజు రాసిన సంభాషణలు జనాన్ని ఆకట్టుకున్నాయి. పాటలు కూడా అదిరిపోయాయి. అల్లూ, రావుగోపాలరావు, సత్యనారాయణల యాక్షన్ గూస్ బంప్స్!! ఇక, స్క్రిప్టు రాస్తున్నప్పుడు ప్రధాన పాత్రల విషయమై నరసరాజుకు ఓ ఆలోచన వచ్చిందట. అదే ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘దాన వీర శూర కర్ణ’లో అభిమన్యుడిగా బాలకృష్ణ ప్రేక్షకలను మెప్పించారు.
దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘యమగోల’లో కథానాయకుడి పాత్రకు బాలకృష్ణను తీసుకుని యముడి పాత్రను ఎన్టీఆర్‌తో చేయిస్తే తండ్రీకుమారుల కలయిక బ్రహ్మాండంగా రక్తి కడుతుందని నరసరాజుకు అనిపించిందట. ఆ విషయాన్ని ఆయన ‘యమగోల’ నిర్మాత సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఎస్.వెంకటరత్నంతో పంచుకుని ఎన్టీఆర్‌ని అడగమన్నారట. కథ ఓకే అన్న ఎన్టీఆర్ తండ్రీ కుమారుల కాంబినేషన్ విషయంలో మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారట.
”ప్రస్తుతం బాలయ్య చదువుని దృష్టిలో ఉంచుకుని సొంత చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. బయట చిత్రాల గురించి ఆలోచించటం లేద”ని చెప్పారట. దీంతో బాలయ్యకు దక్కాల్సిన హీరో పాత్ర ఎన్టీఆర్‌కు దక్కింది. ఒక వేళ ఎన్టీఆర్ ఒప్పుకొని ఉంటే ప్రేక్షకులకు ఓ అద్భుతమైన కాంబినేషన్ బాలయ్య హీరోగా అన్నగారిని యముడి పాత్రలో చూసే అవకాశం దక్కేది.