నందమూరి ఫ్యామిలీకి ముందు నుంచి నిర్మాతల ఫ్యామిలీగా మంచి పేరు ఉంది. దివంగత సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత తరంలో బాలయ్య, హరికృష్ణ.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్‌రామ్ ఎవరు అయినా కూడా ఒక్క సినిమా హిట్ అయితే రెమ్యునరేషన్ పెంచరు. పాత రెమ్యునరేషన్ ఎంత ఉందో అంతే ఉంచుతారు. లేకపోతే 5 % ఎక్కువ ఇస్తే ఇవ్వండని మాత్రమే చెపుతారు. ఎక్కువ రెమ్యునరేషన్ల కోసం నిర్మాతలను పీల్చి పిప్పి చేయడం వాళ్లకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు.
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్‌కు వరుస హిట్లు వచ్చినా కూడా తన మార్కెట్ ఎంత, తన సినిమాలకు వచ్చే కలెక్షన్లు చూసి మాత్రమే తరచూ రేటు పెంచుతూ ఉండేవారు. ఒకవేళ ఎవరైనా నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నామని చెపితే వారి దగ్గర మాత్రం చూసి తీసుకునేవారు. ఎవరైనా అన్నగారు రేటు పెంచమని అంటే బ్రదర్ వద్దు.. మనతో సినిమా తీసిన నిర్మాతల పెళ్లాం, పిల్లలు ఓ రూపాయి తినాలి కదా… వాళ్లు ఆ డబ్బులతో తిరిగి మనతోనే సినిమాలు తీస్తారు ? కదా ? అనేవారు.
ఇక తండ్రి నట వారసత్వాన్ని అంది పుచ్చుకున్న బాలయ్య కూడా రెమ్యునరేషన్ విషయంలో ఏనాడు నిర్మాతలను ఇబ్బంది పెట్టింది లేదు. నిర్మాతలు ఎంత ఇస్తామని చెపితే అంతే తీసుకునేవారు. ఇక అఖండ బాలయ్య కెరీర్ బ్లాక్‌బస్టర్. అన్ని వసూళ్లు వచ్చినందుకు మరో హీరో అయితే ఏకంగా ఆరేడు కోట్లు రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేస్తారు. అయితే బాలయ్య పెంచింది జస్ట్ రు. 2 కోట్లు మాత్రమే.
గతంలో ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్న చంటి అడ్డాల బాలయ్యతో పవిత్రప్రేమ సినిమా తీశారు. ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా కోసం బాలయ్యకు రు. 60 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత సమరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. ఆ వెంటనే మరోసారి చంటి బాలయ్య దగ్గరకు వెళ్లారట. తన బ్యానర్లో సినిమా చేయమని అడిగిన వెంటనే బాలయ్య ఓకే చెప్పేశారట.
అయితే సమరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కదా? బాలయ్య రు. 2 కోట్లు అడుగుతాడు.. తాను రు 1.5 కోట్లకు బతిమిలాడుకుందామని అనుకున్నాడట మనసులో.. అయితే బాలయ్య పోయిన సారి రు. 60 లక్షలు ఇచ్చావు కదా.. అంతే ఇవ్వు… నీకు కుదిరితే మరో రు. 5 వేసి ఇవ్వు అనడంతో చంటికి మతిపోయినంతపనైందట. వెంటనే మనసులోనే బాలయ్యకు దండం పెట్టేసుకున్నాడట.
వాస్తవానికి చంటి అనుకున్న అమౌంట్ రు. 2 కోట్లు.. అయితే 1.5 కోట్లకు రిక్వెస్ట్ చేసుకుందామని అనుకుంటే బాలయ్య అడిగింది.. కనీసం కోటి కూడా కాదు రు. 60 లక్షలే. అలా బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను పీల్చి పిప్పిచేసేందుకు ఏనాడు ఇష్టపడడు. తన సినిమాల వసూళ్లు, మార్కెట్ లెక్కలు వేసుకునే అడుగుతాడు.