ఎన్టీఆర్ కుటుంబానికి సొంత స్టూడియో రామకృష్ణా సినీ స్టూడియో. ఇది అన్నగారి కుమారుడి పేరుతోనే ఏర్పాటు చేసుకున్నారు. తమిళనాడు(మద్రాసు) నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి వచ్చేస్తున్న సమయంలో అన్నగారు దీనికి ప్లాన్ చేసుకున్నారని అంటారు. అయితే.. దీనికి ముందు అక్కినేని నాగేశ్వరరావే.. అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారనేది ఒక వాదన ఉంది. అన్నగారిని చూసి అక్కినేని కట్టారా? లేక అక్కినేని సలహాతో అన్నగారు నిర్మించారా.. అనేది ఇప్పటికీ మిస్టరీనే!
ఏదేమైనా ఇద్దరు అగ్ర హీరోలకు కూడా.. హైదరాబాద్‌లో స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. దీనివెనుక అన్నగారికి చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అందరూ మద్రాస్ నుంచి ఏపీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, తాను మాత్రం వెళ్లేది లేదు. కాంగ్రెస్ పాలకులు.. తనను శతృవులాగా చూస్తున్నారు అని అప్పటి కాంగ్రెస్ నేతలపై అన్నగారు రుసరుసలాడేవారు.ఇలాంటి సమయంలో అక్కినేని తొలిసారి హైదరాబాద్‌కు వచ్చేశారు. ఆయనకు కాంగ్రెస్ నేతల అండదండలు ఉన్నాయి.
నిజానికి అక్కినేనికి రాజకీయ వాసన పడకపోయినా.. కాంగ్రెస్ నేతలు.. ఆయనను పరిచయం చేసుకుని.. రాజకీయంగా వాడుకునే వ్యూహాన్ని అనుసరించారు. ఎలానూ.. ఎన్టీఆర్ తమ మాట వినేవాడు కాదనే నిర్ణయానికి అప్పటి కాంగ్రెస్ నేతలు వచ్చేశారు. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ వెళ్లిపోయింది. మరి షూటింగులు అంటే.. మళ్లీ మద్రాస్‌కు రావాల్సిందే. ఇక్కడే స్టూడియోలు ఉన్నాయి. ఎక్విప్‌మెంట్లు ఉన్నాయి. ఈ సమయంలో వెళ్లి రావడం అంటే.. ఖర్చులు, సమయం వృథా. అందుకే.. అలాంటి సమయంలోనే అన్నగారు రామకృష్ణా సినీ స్టూడియోస్ నిర్మాణానికి పూనుకొన్నారు.
దీనికి కొందరు అడ్డు పడ్డారని అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నగారికి అనుమతి ఇవ్వలేదని.. అనుకున్న సమయానికి ఇది పూర్తి కాలేదని చెబుతారు. ఏదేమైనా.. నాలుగు సంవత్సరాలు పట్టింది. ఈ నాలుగు సంవత్సరాలు అన్నగారు మద్రాస్ టు హైదరాబాద్ తిరుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు హైదరాబాద్‌లో స్టూడియో ఏర్పడిన తర్వాత.. అందరికీ అద్దెకు కూడా ఇవ్వడం ప్రారంభించారు. ఇదీ.. సంగతి!