ఎన్టీఆర్-ఎస్వీఆర్.. ఈ ఇద్దరి గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. తమిళ సినీ రంగంలో కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నగారు హీరోగా నటిస్తే.. ఎస్వీఆర్ విలన్‌గా అనేక సినిమాల్లో నటించారు. గుండమ్మకథ వంటి కొన్ని సాంఘిక సినిమాల్లో తండ్రీ, తనయులుగా కూడా ఎన్టీఆర్-ఎస్వీ రంగారావు కలిసి నటించిప్రేక్షకులను మెప్పించారు. అయితే.. తర్వాత కాలంలో ఈ ఇద్దరి మధ్య కూడా.. విభేదాలు వచ్చాయనే టాక్ నడించింది.
దీనికి కారణం.. కూడా ఉందని, ఇది నిజమేనని గుమ్మడి వెంకటేశ్వరరావు రాసుకున్న జీవిత చరిత్ర పుస్తకంలో ప్రస్తావించారు. ఎస్వీఆర్ కూడా చాలా మంది నటుల మాదిరిగానే రూపాయికి విలువ ఇచ్చేవారు కాదట. ఇది ఎన్టీఆర్‌కు నచ్చని వ్యవహారం. తనతో ఉండే వారికి కూడా ఆయన ఆర్థికంగా జాగ్రత్తలు చెప్పేవారు అనేది అందరికీ తెలిసిందే. ఇలా.. అన్నగారి బాటలో నడిచిన శోభన్‌బాబు, చలపతిరావు (అప్పట్లో వర్థమాన నటుడు) వంటివారు రూపాయిని జాగ్రత్త చేసుకున్నారు.
కానీ, సావిత్రి, ఎల్ వరలక్ష్మి, రంగారావు వంటివారు ఒక బ్యాచ్‌గా ఉండేవారు. దీంతో వారికి జల్సాలు ఎక్కువ. ఒక సందర్భంగా రంగారావుకు ఇంట్లో శుభకార్యం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ఆయన దగ్గర డబ్బులు సరిపోలేదు. దీంతో అన్నగారికి ఫోన్ చేసి.. ఆర్థికంగా సాయం చేయమని కోరారు. అయితే, ఆయన దగ్గర ఉన్న చనువు కొద్దీ.. నేను చెప్పాను మీరు వినలేదు. ఇప్పుడైనా తెలుసుకోండి.. అని అన్నారట. దీంతో ఎస్వీరంగారావు కొంత హర్ట్ అయి.. అప్పటినుంచి అన్నగారితో నటించడమే మానుకున్నారని గుమ్మడి తెలిపారు.
అయితే, ఈ విషయంలో అన్నగారి తప్పులేదని, ప్రతి విషయంలోనూ జాగ్రత్త ఉండాలని, ముఖ్యంగా వ్యసనాలకు దూరంగా ఉండాలనేది అన్నగారి అభిలాష అని పదే పదే చెప్పేవారని గుమ్మడి పేర్కొన్నారు. ఆయన బాటలో నడిచిన చాలా మంది సక్సెస్ అయ్యారని, కానీ,ఎక్కువ మంది చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇది నిజమే కదా..!