నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తోన్న బాలయ్య ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమాను లైన్లో పెట్టేశాడు. మలినేనీ గోపీ డైరెక్ట్ చేస్తోన్న సినిమాకు వీరసింహారెడ్డి టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రియమణితో పాటు ఒకరిద్దరు ముదరు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమాకు రామారావు గారు అన్న టైటిల్ పరిశీలనలో ఉందన్న ప్రచారం అయితే జరుగుతోంది. సన్‌షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత బాలయ్య లైనప్‌లో బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు సడెన్‌గా మరో క్రేజీ డైరెక్టర్ పేరు బాలయ్య లైనప్‌లోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు పరశురాం. పరశురాం రీసెంట్గా మహేష్‌బాబుతో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా బాగున్నా కమర్షియల్‌గా అంచనాలకు కొంత దూరంలోనే ఆగిపోయింది.
పరశురాం సినిమాలంటేనే కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. తాజాగా ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్లో పరశురాం మాట్లాడిన మాటలు కూడా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందన్న అంచనాలకు బలం ఇచ్చాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమా ఉండే ఛాన్సులు ఉన్నాయి. మామూలుగానే పరశురాం ఎక్కువుగా గీతా కాంపౌండ్‌లో ఉంటాడు.
ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య రావడం.. అక్కడ డిస్కర్షన్ చూస్తుంటే ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు అయినా సెట్ అవ్వొచ్చనే అంటున్నారు. పరశురాం – బాలయ్య అంటే వినడానికే చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. రేపు నిజంగా సెట్ అయితే కేక పెట్టించడం ఖాయం.