సహజనటి సాయి పల్లవి నటనలో ఎంత మేటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆమె ముక్కుసూటితనం వల్ల కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నటనపరంగా సాయి పల్లవికి వంక పెట్టలేం. ఆమె టాప్ హీరోలతో పోటీపడి మరి నటిస్తుంది. అయితే సాయి పల్లవి ఒక్కోసారి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణం అవుతున్నాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. డాక్టర్ విద్య అభ్యసించిన సాయి పల్లవి నటిగా మారిన సంగతి తెలిసిందే. మలయాళ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన సాయి పల్లవి సౌత్ ఇండియాలో ఒక్క సినిమాతో సూపర్ పాపులర్ అయిపోయింది.
ఇప్పుడు తెలుగులోనూ ఆమె వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. సాయి పల్లవి కేరళ – తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న తులు అనే తెగకు చెందిన కుటుంబంలో జన్మించింది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే సాయి పల్లవి సినిమాల్లోకి రావడానికి ముందుగా డ్యాన్స్ పోటీలలో పాల్గొంది. టీవీల్లో వచ్చే డ్యాన్స్ పోటీల్లో పాల్గొని అక్కడ పాపులర్ అయి… ఆ తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఏ డ్యాన్స్ పోటీలు అయితే సాయి పల్లవి పాపులర్ కావటానికి కారణం అయ్యాయో ? ఇప్పుడు హాట్ డాన్స్ పోటీలనే ఆమె విమర్శిస్తోంది. అలాంటి పోటీలపై తనకు అస్సలు నమ్మకం లేదని చెబుతోంది.
తమిళ విజయ్ టీవీలో ప్రసారమైన మీలో ఎవరు ప్రభుదేవా డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్న ఆమె ద్వితీయ బహుమతి గెలుచుకుంది. ఇదే ఆమెను బాధ పెట్టిందట. తనకు ప్రథమ బహుమతి రాకపోవడానికి కారణం ధన బలం అంటూ అక్కసు కూడా వెళ్లగక్కింది. డ్యాన్స్ పోటీల్లో ప్రతిభకు గుర్తింపు ఉండదు… ఛానెళ్లలో డబ్బుతో పాటు స్టార్స్ వారసులకే ఎక్కువ మర్యాదలు ఉంటాయని చెప్పింది.
ఈ కారణంతోనే తనకు డ్యాన్స్ పోటీలంటే నమ్మకం లేదని.. అసహ్యం అని చెప్పింది. అయితే ఇదే సాయిపల్లవి ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ధనుష్ పక్కన చేసిన మారి 2 సినిమాలో రౌడీ బేబీ సాంగ్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ సాంగ్‌కు నేషనల్ వైడ్‌గా ఎంత పాపులారిటీ వచ్చిందో చూశాం. ఏదేమైనా సాయిపల్లవి ఎక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిందో అదే డ్యాన్స్ షోలు, టీవీ ఛానెల్స్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.