కొన్ని కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ ఛాన్స్‌లు మిస్ చేసుకున్నారని తెలుసా? అంతేకాదు.. కొన్ని కథలు ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని రాసినవే అయినా.. ఆయన చేయలేక పోయిన విషయం.. కాల్‌షీట్లు కుదరకపోయిన విషయం వంటివి ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎంతో ఆసక్తిగా ఉంటాయి. భక్త తుకారం సినిమా కోసం.. మొదట్లో అనుకున్నది ఎన్టీఆర్ నే. అయితే, ఆయనకు కాల్ షీట్ల ప్రాబ్లం రావడంతో తర్వాత అక్కినేని నాగేశ్వరరావును ఎంచుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని రాబట్టింది.
రాము సినిమాలో అన్నగారు నటించారు. మెప్పించారు. కానీ, ఈ సినిమాకు మొదట్లో బుక్ చేసుకున్న హీరో మాత్రం అన్నగారు కాదు!ఏవీఎం స్టూడియో నిర్మించిన ఈ సినిమాకు మొదట్లో నటశేఖర కృష్ణను బుక్ చేసుకున్నారు. అయితే, ఆయనను ఎందుకో వద్దని అనుకున్నారు. తర్వాత.. ఎన్టీఆర్‌ను బుక్ చేసుకున్నారు. ఇక, ఆయన కాల్ షీట్లు ఖాళీ లేకపోయినా.. ఆరు మాసాలు వెయిట్ చేసి మరీ అన్నగారితోనే ఈ సినిమా చేశారు.
అదేవిధంగా రాఘవేంద్రరావు తీసిన సినిమాల్లో అన్నగారి పాత్రలు హిట్ అయ్యాయి. అయితే.. వీటి వెనుక.. అన్నగారు రాసుకున్న కొన్ని డైలాగులు ఉండడం గమనార్హం. జస్టిస్ చౌదరి మూవీకి చాలా డైలాగులు అన్నగారే రాసుకున్నట్టు రాఘవేంద్రరావే చెప్పారు. ఇక, శ్రీకృష్ణ పాండవీయం సినిమాను ఎన్టీఆర్ స్వయంగా నిర్మించి, దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా కథా పరంగా బాగానే ఉన్నా.. వసూళ్ల పరంగా దెబ్బేసింది. దీంతో ఎన్టీఆర్ రెండు నెలల పాటు మనో వేదనకు గురయ్యి ఆయనలో ఆయనే బాధ పడేవారు.
ఆ తర్వాత.. చాలా ఏళ్ల పాటు ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేయలేదని అంటారు. ఇక, సాంఘిక సినిమాల్లో నటించేప్పుడు.. అన్నగారి సౌష్ఠవం అడ్డువచ్చింది. పొట్ట తగ్గించాలనేది ప్రధానంగా డిమాండ్. అయితే.. తెల్లవారు జామున షూటింగుకు వెళ్తే.. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ఎన్టీఆర్‌కు ఎక్సర్ సైజ్ చేసే తీరిక ఉండేది కాదు. దీంతో ఆయన పొట్టపై శ్రద్ధ పెట్టేవారు కాదు. దీంతో బాలీవుడ్ లో ఒక చక్కని అవకాశం మిస్సయ్యారని.. అంటారు.