టైటిల్: జిన్నా
నటీనటులు: విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్, నరేష్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
నిర్మాతలు: మోహన్ బాబు మంచు
దర్శకత్వం : ఈశాన్ సూర్య
రిలీజ్ డేట్: అక్టోబర్ 21, 2022
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
గత కొంత కాలంగా వరుస ప్లాపులతో మార్కెట్ పూర్తిగా కోల్పోయిన మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ రోజు జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విష్ణు మా అధ్యక్షుడు అయ్యే క్రమంలో జరిగిన గొడవలు, మాటల తూటాలతో చాలా వర్గాలు ఆయన్ను టార్గెట్ చేశాయి. ఇక ఇటు సినిమాలు సరిగా ఆడట్లేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ రోజు విష్ణు ఈషాన్ సూర్య దర్శకత్వంలో జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ ఉండడంతో సినిమాపై కాస్త హైప్ వచ్చింది. మరి విష్ణు జిన్నాగా అలరించాడా ? లేదా ? అన్నది TL సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
టెంట్ హౌస్ నడుపుకునే జిన్నా (విష్ణు మంచు) ఊళ్లో అందరి వద్దా అప్పులు చేస్తూ స్వాతి (పాయల్ రాజ్ పుత్) తో ప్రేమలో ఉంటాడు. అప్పులు ఎలా తీర్చాలా ? అని ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఈ టైంలో రూబీ (సన్నీలియోన్) రేణుకగా అమెరికా నుంచి ఎంట్రీ ఇస్తుంది. ఆమె దగ్గర ఆస్తి, డబ్బుందన్న కారణంతో జిన్నా ఆమెకు దగ్గరవుతాడు. అయితే జిన్నాకు అమెరికా నుంచి వచ్చింది రేణుక కాదు.. రూబీ అన్న నిజం తెలుసుకుంటాడు. అసలు రూబీ రేణుకగా ఎందుకు వచ్చింది ? ఈ ట్విస్ట్ వెనక సీక్రెట్ ఏంటి.. జిన్నా అప్పులు తీర్చాడా ?? స్వాతిని పెళ్లి చేసుకున్నాడా ?? అసలు ఈ కథలో ట్విస్టులు ఏంటన్నదే జిన్నా సినిమా.
విశ్లేషణ :
జిన్నాలో మంచు విష్ణు క్యారెక్టర్ మెయిన్ హైలెట్. జిన్నాగా తన పాత్రలో గత సినిమాలతో పోలిస్తే బాగా కష్టపడ్డాడు. తన కెరీర్‌లోనే ఇటీవల కాలంలో చాలా బెస్ట్ పెర్పామెన్స్ ఇచ్చాడు. నటనతో పాటు సెటైరికల్‌గా, కామెడీతో నవ్వించాడు. డ్యాన్స్, ఫైట్లు, డైలాగులు బాగున్నాయి. ఇక రెండో హైలెట్ సన్నీలియోన్. సన్నీ ఉందంటే కుర్రకారు థియేటర్లకు పరుగులు పెడతారు. కేవలం సన్నీ అందచందాలే కాకుండా… నటనతో మెప్పించింది. ఈ సినిమా తర్వాత సన్నీకి తెలుగులో ప్రయార్టీ ఉన్న రోల్స్ రావొచ్చు. ఇక పాయల్ అందాలు, నటన కూడా బాగుంది.
సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టుతో పాటు సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకుపోయాయి. సినిమాకు తిరుగులేని హీరో దర్శకుడు సూర్యనే. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను డిజైన్ చేసుకున్నాడు. ఫస్టాఫ్ కంటే సినిమాకు కీలకమైన సెకండాఫ్‌ను డీల్ చేసిన తీరు బాగుంది. అనూప్ మ్యూజిక్, నేపథ్య సంగీతం.. చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయాయి.
ఇక కొన్ని చోట్ల స్లో నెరేషన్‌తో పాటు ఫస్టాఫ్ కాస్త ల్యాగ్‌గా ఉండడం.. మొదటి నుంచి పంచ్ డైలాగులు, కామెడీ పేలిపోయినా.. ఫైట్స్ ఉన్నా కథ ముందుకు సాగకపోవడం చిన్న కంప్లైంట్. అక్కడక్కడా రొటీన్ సీన్లు పడ్డాయి. టెక్నికల్‌గా దర్శకుడు సూర్య అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా సినిమాను మెప్పించాడు. పాటలు కూడా బాగున్నాయి. అనూప్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాను మరో లెవల్లో నిలబెట్టింది. నిర్మాణ విలువలతో పాటు చోటా కె.. నాయుడు సినిమాటోగ్రఫీ విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి.
ఫైనల్‌గా…
మంచు విష్ణు నుంచి చాలా రోజుల తర్వాత దూసుకెళ్తా, దేనికైనా రెఢీ స్టైల్ సినిమాగా జిన్నా నిలుస్తుంది. ఇటీవల సినిమాలతో పోలిస్తే పెర్పామెన్స్ పరంగా కొత్తగా ట్రై చేయడంతో పాటు కామెడీ, యాక్షన్, సాంగ్స్ పరంగా కూడా జిన్నా బాగుంది. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా చిన్న కంప్లైంట్లు ఉన్నా సెకండాఫ్‌ను దర్శకుడు బ్రహ్మాండంగా నడిపించి సినిమాను సక్సెస్ చేసేశాడు. కామెడీ ఎంటర్టైనర్లు ఇష్టపడే వారికి జిన్నా ఫుల్ మీల్స్ పెడుతుంది.
ఫైనల్ పంచ్ : హమ్మయ్యా జిన్నాతో విష్ణు హిట్ కొట్టాడు…
TL జిన్నా రేటింగ్ : 3/5