యాక్టింగ్ ఇంకాస్త బాగుంటే బాగుండేది, మ్యూజిక్ యావరేజ్‌గా ఉంది, నెరేషన్ బాగా స్లో ఉందిగా, కొత్తగా ఏం చెప్పిండ్రు, అంతా మనకు తెలిసిందేగా…….. అని ఆలోచించే ఈగోయిస్టిక్ కుహానా మేధావులందరూ ఇంతటితో చదవడం ఆపెయ్యండి. ఇకపైన చదవొద్దు. అలాగే ‘శ్రీకారం’లో చూపించిన ప్రపంచాన్ని చూడొద్దు కూడా. మన జ్ఙాపకాల్లో ఎక్కడో దాగున్న ఆలోచనలను మరోసారి తట్టి లేపే మన ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారా? మన మూలాలను మనకు గుర్తు చేసే ఓ మంచి కథను చూడాలనుకుంటున్నారా? సిటీ లైఫ్ స్టైల్‌కి, డబ్బు సంపాదనకు బాగా అలవాటుపడి జిడిపి, 4జిలే అభివృద్ధి అనుకుంటూ, మనదైన ప్రపంచాన్ని మర్చిపోయి, ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం అన్న విషయాన్ని హృదయాన్ని కదిలించేలా చెప్పిన ఓ చిన్ని స్టోరీని చూడాలనుకుంటే మాత్రం రండి….మనందరం కూడా ‘శ్రీకారం’ చూద్దాం.
‘బాహుబలి’ కంటే భారీ బడ్డెట్, అంతకుమించి అనే స్థాయి గ్రాఫిక్స్, బాత్రూంలో కూడా కేవలం బ్రాండెడ్ ఐటెమ్స్తోనే కనిపించే హీరోలు, ఆ మార్కెెట్ ప్రపంచమే కాదు….. మన తల్లివేర్లకు సంబంధించిన మన ఊరిని, మన కథలను కూడా వెండితెరపైన అద్భుతంగా చూపించడం ఎలా….? అని తెలుసుకోవాలనుకునే క్రియేటివ్(?) ఫిల్మ్ మేకర్స్ కూడా రండి. ‘శ్రీకారం’ చూద్దాం.
మన మెదళ్ళలో ఉన్న మేథస్సును మొత్తం పక్కనపెట్టేద్దాం. మనం మర్చిపోయిన మన ప్రపంచాన్ని, మనం పుట్టి పెరిగిన మన నేల తల్లిని, మన కడుపు నింపడం కోసం ఆరుగాలం పాటు కష్టపడుతున్న మన రైతన్నను…..అలాగే సర్, బ్రో, మేడం అనే పిలుపుల్లో పడిపోయి మనం మర్చిపోయిన మామా, బాబాయ్, మేనత్త, అల్లుడు, ఏరా…లాంటి ఆత్మీయ పిలుపులను కూడా ప్రేమగా వినండి. హృదయంతో చూడండి. ఓ గొప్ప ‘తడి’ కనిపిస్తుంది. ఆ చెమ్మను ఫీలవ్వండి. ఈ వీడియో తీసినవాళ్ళను అసంకల్పితంగానే అభినందిస్తారు.
అంతటితో ఆగిపోతే ఈ కథను చూసినందుకు అర్థం లేకుండా పోతుంది. ఈ కథలో చూపించినట్టుగా ‘రైతన్నా..’ అని సగర్వంగా పిలించుకునేంత సత్తా సామర్ధ్యం మనలో చాలా మందికి ఉండదు. కానీ ఆ రైతు ఆకలి కూడా తీరేలాగా ….కొంచెం ఎక్కువ ఖర్చు అయినప్పటికీ…. స్వయంగా ఆ రైతు దగ్గరకు వెళ్ళి ఆరోగ్యకరమైన, మంచి ఫుడ్ గ్రెయిన్స్‌ని కొనుక్కునే అవకాశం మాత్రం మనందరికీ ఉంది. ఏ మెట్రో, స్మార్ట్ సిటీలలో ఉన్నప్పటికీ ఊరి నుంచి వస్తువులు తెప్పించుకోవడం పెద్ద కష్టమైన విషయమేం కాదు. అలా చేయడం వళ్ళ రైతులందరూ బాగుపడిపోతారా? అని అడక్కండి. రైతుకు ఒక్క పైసా ఆదాయం వచ్చేలా మనం చేయగలిగినా అది ఎంతో కొంత మార్పుకు శ్రీకారం అయితే అవుతుంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఓ మంచి మార్పుకోసం ‘శ్రీకారం’ కు శ్రీకారం చుట్టిన ఈ మహానుభావుల సరసన మనకు కూడా చోటు లభిస్తుంది. ప్రయత్నం చేద్దామా?
https://youtu.be/K3FDMAiA2bE