ఒక కొబ్బరినూనె ఉత్పత్తి, మార్కెటింగ్ సంస్థపై నటీమణి కాజల్ అగర్వాల్ వేసిన పిటిషన్ వ్యవహారంలో ఆమె అనుకూలమైన వార్త ఒకటి వెల్లడైంది. ఈ ఘటన ఆసక్తికరమైన మలుపు తిరిగింది. గతంలో ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఈమె సంబంధిత సంస్థ తనకు రెండున్నర కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాజల్ మద్రాస్ హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో వ్యవహారం కాజల్ కు అనుకూలంగా మారింది.
దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై హై కోర్టు స్టే విధించింది. వాస్తవానికి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏడాది పాటే ఈ యాడ్‌ని ప్రసారం చేయాల్సి ఉంది కానీ సంబంధిత సంస్థ దీనిని ఉల్లంఘించడంతో తనకు రెండున్నర కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని కాజల్ తన పిటిషన్ లో పేర్కొంది.
అయితే దిగువ కోర్టు కాజల్ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఆ సంస్థకు యాడ్‌పై అరవై సంవత్సరాల వరకూ హక్కులు ఉంటాయని పేర్కొంది. అక్కడ ఎదురుదెబ్బ తగిలినా కాజల్ అగర్వాల్ హై కోర్టులో పిటిషన్ వేసింది. ఆ సంస్థ తను నటించిన యాడ్ ను వాడుకున్నందుకు పరిహారాన్ని చెల్లించాల్సిందే అని హై కోర్టులో పిటిషన్ వేసింది కాజల్. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు కొబ్బరినూనె కంపెనీని ఆదేశించింది. మొత్తానికి కాజల్ అనుకున్నది సాధించే క్రమంలో కాస్తో కూస్తో పై చేయి సాధించినట్లే !!