Moviesఎన్టీఆర్ - కృష్ణంరాజు మ‌ధ్య స్నేహం ఇంత గొప్ప‌దా...!

ఎన్టీఆర్ – కృష్ణంరాజు మ‌ధ్య స్నేహం ఇంత గొప్ప‌దా…!

టాలీవుడ్లో 50 ఏళ్లకుపైగా హీరోగా, విలన్గా అటు దిగ్గజ నటులతో ఇటు యువ నటులతో త‌న‌దైన శైలిలో న‌టించిన సీనియర్ నటుడు కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్ తో ఎలా ప‌నిచేశారు..? అన్న‌గారితో అనుబంధం ఎలా ఉండేది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.

అన్న‌గారితో కృష్ణంరాజుకు ఉన్న అనుబంధం గురించి సినీరంగంలో అనేక అంశాలు ప్ర‌చారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ను శ్రీ‌కృష్ణునిగా తెర‌పై చూడ‌డమంటే కృష్ణంరాజుకు ఎంతోఇష్టమట. కృష్ణంరాజు తొలిసారి ఎన్టీఆర్ను కృష్ణుని గెట‌ప్లో ఉన్న‌ప్పుడే కలుసుకున్నారట. ‘శ్రీకృష్ణతులాభారం’ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీ‌కృష్ణును వేషంలో ఉండ‌గా ఆయ‌న‌ను తొలిసారి క‌లుసుకున్నారు. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ త‌న‌పై చూపిన ఆప్యాయ‌త‌ను ఎన్న‌టికీ మ‌ర‌చిపోలేన‌ని చెప్పేవారు కృష్ణంరాజు.

ఎన్టీఆర్.. కృష్ణంరాజుకు త‌న చిత్రాల‌లో ఏవైనా పాత్రలు ఉంటే ఇప్పించేవారు. అలా ఎన్టీఆర్‌తో క‌లిసి కృష్ణంరాజు భ‌లే మాస్ట‌ర్, బ‌డిపంతులు, మ‌నుషుల్లో దేవుడు, మంచికి మ‌రోపేరు, ప‌ల్లెటూరి చిన్నోడు, వాడే-వీడు, స‌తీసావిత్రి చిత్రాల‌లో న‌టించారు. ఎన్టీఆర్ తర్వాత కొన్ని పాత్ర‌ల‌కు కృష్ణంరాజు మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని అప్ప‌టి ర‌చ‌యితలు, ద‌ర్శ‌కులు భావించేవారు. అలా రూపొందిన ‘బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌’ చిత్రంతో కృష్ణంరాజు జేజేలు అందుకున్నారు. తాండ్ర పాపారాయుడు, శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు వంటి పాత్ర‌ల్లోనూ న‌టించి అల‌రించారు.

ఇక‌, రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత కృష్ణంరాజు.. అతి త‌క్కువ కాలంలోనే అన్న‌గారిని క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే సంక‌ల్పంతో ఉంటే చిర‌కాలం రాజ‌కీయాల్లో మ‌న్న‌న‌లు ద‌క్కుతాయ‌ని ఆ సంద‌ర్భంగా ఎన్టీఆర్ సూచించార‌ట‌. ఆయ‌న సూచ‌న‌లో.. లేక కృష్ణంరాజు వ్య‌క్త‌త్వ‌మో.. మొత్తానికి రాజ‌కీయాల్లో ఉన్న‌న్నాళ్లూ.. కృష్ణంరాజు ఎలాంటి మ‌ర‌క‌లు లేకుండానే జీవించ‌డం.. గ‌మ‌నార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news