ఇటీవల కాలంలో ఆచార్య తర్వాత అంత పెద్ద డిజాస్టర్ విజయ్ దేవరకొండ లైగర్. ఈ సినిమా కనీసం ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా రాబట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే లైగర్ దెబ్బతో పూరి, ఛార్మీ మళ్లీ పాతాళంలోకి వెళ్లిపోయారని అంటున్నారు. అటు ఈ సినిమా ఏకంగా 65 – 70 శాతం భారీ నష్టాలు తెచ్చిపెట్టిందంటున్నారు. విజయ్ దేవరకొండ – పూరి అనగానే ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కట్‌చేస్తే ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
అయితే ఈ సినిమాపై ఎప్పుడూ లేనంతగా సోషల్ మీడియాలో కూడా నెగటివ్ టాక్ భారీ ఎత్తునే నడిచింది. అయితే ఈ సినిమాను ముందు ఏపీ, తెలంగాణ రైట్స్ హోల్‌సేల్‌గానే కొనేసిన నైజాంకు చెందిన వరంగల్ శ్రీను ఈ సినిమాకు కొందరు కావాలనే వెన్నుపోటు పొడిచారని అంటున్నారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీను సంచలన విషయాలు మాట్లాడారు.
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ చాలా చెడ్డ దశలో ఉందని.. కొందరు నటులతో పాటు, డైరెక్టర్లను కూడా బ్యాన్ చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఈ చర్యల వల్ల వేలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడడంతో పాటు నష్టపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నటులు, దర్శకుల మీద వ్యక్తిగత కక్షలతో జరిగే ఇలాంటి ప్రచారాల వల్ల సినిమాలు తగ్గుతాయని… దీంతో సినిమా పరిశ్రమ ఆధారపడి బతికే వేలాది మంది పేద కార్మికుల కుటుంబాలు భుక్తిని కోల్పోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక లైగర్ సినిమాపై దాదాపు ప్రతి రోజు ఓ యాంటీ ప్రచారం బాగా చేశారని.. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం వరకు ఓకే గాని… అయితే లైగర్ రిలీజ్‌కు ముందు నుంచే ఆ సినిమాను చూడకుండానే కొందరు కావాలని నెగటివ్ ప్రచారం గట్టిగా చేశారు అని వాపోయాడు. ఇక తాను ఈ యేడాదిలోనే రు. 100 కోట్లు నష్టపోయానన్న వార్తలను ఖండించిన శ్రీను అయితే చాలా నష్టపోయిన మాట నిజమే అని చెప్పాడు.
ఇక లైగర్ సినిమా క్లైమాక్స్ చివరి 7-10 నిమిషాలు బాగోలేదని.. సినిమా ఉండాల్సినంత లేకపోవడంతో సినిమా ప్లాప్ అయ్యిందని చెప్పాడు. దీంతో ఇప్పుడు వరంగల్ శ్రీను చెప్పినట్టు ఇండస్ట్రీలో ఎవ్వరు లైగర్ సినిమాను టార్గెట్ చేశారా ? అని కొందరి పేర్లు టార్గెట్‌గా చర్చలు నడుస్తున్నాయి.