నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లకు ఎంత విలువ ఇస్తారో చెప్పక్కర్లేదు. నిర్మాతలు అనేవాడు లేకపోతే అసలు ఇండస్ట్రీయే లేదు.. సినిమాలు తీసేవారే లేరు అన్నది బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నారు. అందుకే నిర్మాతలతో పాటు సినిమాకు ప్రాణం అయిన కెప్టెన్ దర్శకుడు, ఇతర టెక్నీషియన్లకు ఎన్టీఆర్.. ఆ తర్వాత బాలయ్య ఎంతో విలువ ఇస్తారు. వారి గౌరవం ఏ మాత్రం తగ్గేందుకు… తగ్గించేందుకు ఈ తండ్రి కొడుకులు ఎప్పుడూ ఇష్టపడేవారు కాదు.
ఇక బాలయ్య ఓ సారి కథ విని ఓకే చెప్పాక అస్సలు దర్శకుడి విషయంలో జోక్యం చేసుకోరు. కథలో కాళ్లు, వేళ్లు పెట్టేసి కెలకడాలు ఉండవు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో కూడా చాలా మంది కథ ఫైనల్ అయ్యాక.. ఇంకా చెప్పాలంటే రేపు ఓ సీన్ షూటింగ్ ఉందంటే ఈ రోజు కూడా డైరెక్టర్‌పై ఒత్తిడి చేయించి మార్పించడం మామూలు అయిపోయింది. అసలు కొందరు హీరోలు అయితే డైరెక్టర్‌కు ఏం తెలియదు.. అంతా మేం చెప్పిందే అన్న బిల్డప్పులు ఇస్తుంటారు.
ఇలా ఇచ్చినోళ్లందరూ బొక్క బోర్లా పడుతున్నారు కూడా…! ఇక బాలయ్య – వివి. వినాయక్ కాంబినేషన్లో వచ్చిన సినిమా చెన్నకేశవరెడ్డి. 2002లో వచ్చిన ఈ సినిమా వినాయక్‌కు రెండోది. సినిమా అంచనాలు అందుకోలేకపోయినా ఈ సినిమాలో బాలయ్యను వినాయక్ చూపించిన విధానం.. బాలయ్య చెప్పిన డైలాగులు.. ఆ పంచెకట్టు, మీసకట్టు మాత్రం ఫ్యాన్స్‌కే కాదు.. అందరికి నచ్చాయి. అయితే హడావిడిగా సినిమా తీయడంతో అంచనాలు అందుకోలేదు. అయినా కూడా నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు భారీ లాభాలే వచ్చాయి.
ఆ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా వినాయక్ తనను ప్రజెంట్ చేసిన తీరు బాలయ్యకు చాలా బాగా నచ్చింది. తర్వాత వినాయక్ ఎప్పుడు కలిసినా సినిమా సూపర్ హిట్ అవ్వలేదని నువ్వేం ఫీల్ కావొద్దమ్మా.. నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను.. నీకు నాతో ఎప్పుడు సినిమా చేయాలని అనిపించినా కథ రెడీ చేసుకుని వచ్చేయ్ అని చెప్పారట. అలాగే వినయ్ బయట ఎప్పుడు కలిసినా ముందు ఏం సత్తిరెడ్డి అని సరదాగా పిలుస్తారట.
అలా చెన్నకేశవరెడ్డి సినిమాలోని డైలాగ్ పేరు పెట్టి ఆయన నన్ను పిలవడం అలవాటు చేసుకున్నారని వినాయక్ చెప్పారు. ఇక వినాయక్ ఇంటిలిజెంట్ సినిమా తర్వాత సీ కళ్యాణ్ బ్యానర్లో బాలయ్య హీరోగా మరో సినిమా చేయాలని అనుకున్నారట. అయితే సరైన కథ రెడీ కాకపోవడంతో బాలయ్యతో మళ్లీ తన కాంబినేషన్ సెట్ కాలేదని ఆయన చెప్పారు.