సినిమా రంగంలో అన్నగారికి మిత్రులు తప్ప.. పెద్దగా శతృవులు లేరు. అలనాటి నుంచి నిన్న మొన్నటి తరం దర్శకులు.. నిర్మాతలు.. నటులు.. ఇలా అందరితోనూ అన్నగారు మమేకమయ్యారు. అయితే.. ఒకరిద్దరితో మాత్రం ఎన్టీఆర్ విభేదించారు. వారిలో ఘట్టమనేని కృష్ణ, రెండోవారు దిగ్గజ దర్శకుడు.. దివంగత దాసరి నారాయణరావు. కృష్ణతో విభేదం అనేది పక్కన పెడితే.. సర్దార్ పాపారాయుడు వంటి అత్యద్భుతమైన హిట్ ను ఎన్టీఆర్ ఖాతాలో వేసిన దాసరితో వైరం.. చాలా ఏళ్లు సాగింది.
అసలు పాపారాయుడు, బొబ్బిలిపులి లాంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్టీఆర్‌ను రాజకీయంగా ప్రేరేపించాయి. విచిత్రం ఏంటంటే దాసరి నారాయణరావుకు చిన్నప్పటి నుంచి ఏఎన్నార్ అంటే ఎంతో ఇష్టం. సావిత్రి, ఏఎన్నార్ స్ఫూర్తితోనే దాసరి సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఏఎన్నార్‌తో గ్యాప్ రావడంతో చివరకు దాసరి – ఎన్టీఆర్ బంధం బాగా బలపడింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనూ గ్యాప్ వచ్చింది. అది ఏకంగా.. రాజకీయంగానే కాకుండా.. నైతికంగా కూడా ఇరువురి మధ్య దూరాన్ని పెంచింది.
సినీపరంగా చూసుకుంటే.. అసలు దాసరికి స్టూడియోలు ఇవ్వద్దని.. కొందరికి ఎన్టీఆర్ చెప్పేవరకు వచ్చిందని సినీఫీల్డ్‌లో టాక్ ఉంది. మరి దీనికి కారణం ఏంటి ? అంటే.. సినీ పరంగా చూస్తే.. అన్నగారితో దాసరి కూడా అనేక సినిమాలు తీశారు. వీటిలో హిట్లు చాలానే ఉన్నాయి. అయితే.. రాజకీయ పరంగా చూస్తే.. దాసరి.. ఇందిరమ్మకు అభిమాని. దీంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు.. ఆయనకు వ్యతిరేకంగా.. సినీ రంగం నుంచి దాసరికి ఇందిరమ్మ ఆఫర్ ఇచ్చారని అంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా.. దాసరి చక్రం తిప్పారు.
ఈనాడులో అన్నగారికి అనుకూలంగా వచ్చే వార్తలకు యుద్ధం ప్రకటిస్తూ.. ఉదయం.. పత్రికను తీసుకువచ్చారు. అదేవిధంగా అన్నగారి పాలనకు వ్యతిరేకంగా మండలాధీశుడు అనే సినిమా తీయడంలోనూ.. దాసరి ముందున్నారు. ఫలితంగా.. ఒకానొక సందర్భంగా రెండో సారి అన్నగారు ఓటమికి కూడా దాసరి తెరవెనక చేయాల్సింది చాలానే చేశారని అంటారు. ఈ నేపథ్యంలో అన్నగారు.. దాసరితో తీవ్రస్థాయిలో విభేదించారు.
నిజానికి దాసరి సినీ స్టూడియో నిర్మా ణం చేసుకునేందుకు హైదరాబాద్‌లోస్థలం కోరితే.. అన్నగారు నిరాకరించారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే.. దీనికి కేంద్రం నుంచి ఆయన అనుమతులు తెచ్చుకున్నారు.. ఎలా చూసుకున్నా.. అన్నగారితో దాసరికి.. రాజకీయంగా వచ్చిన విభేదాలు తర్వాత వీరి మధ్య పెద్ద సఖ్యత అయితే లేదు.