ఇటీవలే కృష్ణాష్టమి జరుపుకున్నాం. కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి. అసలు కృష్ణుడు ఎలా ఉంటాడు ? ఆయన ఎలా మాట్లాడతాడు ? ఆయన ఆహార్యం ఎలా ఉంటుంది ? అంటే.. తడుముకోకుండా చెప్పే సమాధానం.. ఎన్టీఆర్ పేరే..! ఎందుకంటే.. శ్రీకృష్ణుడి పాత్రంలో అంతగా లీనమైపోయిన నటుడు ఆయన. శ్రీకృష్ణుడు దివి నుంచి భువికి దిగి వచ్చాడా.. ఆ కాలం నుంచి ఈ కాలంలోకి అడుగు పెట్టాడా.. అన్నట్టుగా.. అన్నగారు ఎన్టీఆర్.. శ్రీకృష్ణుడి పాత్రను కళ్లకు కట్టారు.
కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అనుకునే స్థాయి నుంచి `ఇలానే ఉంటాడు` అనే స్థాయికి చేర్చిన ఏకైక నటుడు ఎన్టీఆర్. ఆయనకు ముందు.. తర్వాత.. కూడా అనేక మంది శ్రీకృష్ణుడి పాత్రలు ధరించినా.. ఇప్పటికీ.. శ్రీకృష్ణుడు అంటే.. ఎన్టీఆరే! మురళిని చేత ధరించడం నుంచి కురుక్షేత్రంలో రథం నడిపే వరకు కూడా ఎన్టీఆర్.. శ్రీకృష్ణుడి పాత్రలో జీవించారంటే.. అతిశయోక్తి కాదు. అయితే.. అన్నగారు.. ఎప్పుడు ఎక్కడ .. ఎలా ఈ కృష్ణుడి పాత్ర ధరించారు? ఈ అవకాశం ఆయనకు ఎలా వచ్చింది? అనేది ఆసక్తికరం.
నాటకాల రచనలో దిట్ట అయిన.. సీనియర్ సముద్రాల.. వినాయకచవితి ప్రాశస్త్యాన్ని చిత్రంగా తీయాలని అనుకున్నారు. అది 1950ల ప్రాంతం. అయితే.. దీనిలో శ్రీకృష్ణుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణుడి పాత్రను ఎవరికి ఇవ్వాలనేది ప్రశ్నగా మారింది. ఆరు అడుగుల ఆజానుబాహుడు కావాలి.. అదే సమయంలో ముఖం అచ్చు పోసినట్టు.. కృష్ణుడిని తలపించాలి.. ఇలా ఊహించుకున్న ఆయన.. అనేక మందిని పిలిచి.. వేషం వేసి చూసుకున్నారు.
వీరిలో ఎస్వీ రంగారావు.. రాజనాల (అప్పటికి యువకుడు) వంటి వారు కూడా ఉన్నారు. అయితే.. ఆయనకు నచ్చలేదు. ఒకరోజు అనుకోకుండా.. వాహినీ స్టూడియోలో ఉండగా.. అక్కడకు ఎన్టీఆర్ వచ్చారు. ఆయనను చూడగానే.. సముద్రాలకు తళుక్కున ఐడియా మెరిసింది. రామారావుతో కృష్ణుడి వేషం వేయించాలని అనుకున్నారు. కానీ, దీనికి తొలుత అన్నగారు అంగీకరించలేదు.
అంతేకాదు.. “పల్లెటూరు వాడితో పరమాత్ముడి వేషమా? వద్దు వద్దు“ అన్నారట. అయితే.. తర్వాత.. రాజనాలే స్వయంగా అన్నగారికి చెపి.. మాకు దక్కని అవకాశం నీకు దక్కుతుంటే.. ఎందుకు వద్దంటున్నావు.. భవిష్యత్తు బాగుంటుందని చెప్పడంతో తొలిసారి వినాయచవితి పౌరాణిక సినిమాలో అన్నగారు శ్రీకృష్ణుడి వేషం వేశారు. ఇక.. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు.