టాలీవుడ్లో కరోనా దెబ్బతో గత రెండేళ్లుగా ఇండస్ట్రీ చాలా వరకు కుదేలైంది. సినిమా షూటింగ్‌లు సరిగా లేవు. దీనికి తోడు ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. కరోనా దెబ్బతో చాలా మంది ఓటీటీలకు అలవాటు పడిపోయారు. కరోనా తగ్గాక పెద్ద హీరోల సినిమాలు వచ్చినా కూడా సినిమా బాగుందన్న టాక్ వస్తే తప్పా ఎవ్వరూ థియేటర్లకు రావడం లేదు. త్రిబుల్ ఆర్, కేజీయఫ్ 2 లాంటి క్రేజీ అంచనాలు ఉన్న సినిమాలు చూసేందుకు పోటెత్తిన ప్రేక్షకుడు తర్వాత పెద్ద హీరోల సినిమాలు వచ్చినా థియేటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదు.
దీనికి తోడు టిక్కెట్ రేట్లు విపరీతంగా పెంచేసుకోవడం.. చివరకు థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో ప్రేక్షకుడికి ఓ మోస్తరు కంటెంట్ ఉన్న సినిమా వచ్చినా కూడా మొఖం మొత్తేసింది. నలుగురు ఫ్యామిలీ ఉన్న వాళ్లు కలిసి సినిమా చూడాలంటే రు. 2 వేలు చాలని పరిస్తితి ఉంది. అందుకే ఇప్పుడు నాని సినిమాలు ఓ మోస్తరు కంటెంట్‌తో వచ్చినా కూడా ప్రేక్షకుడు థియేటర్‌కు రాని పరిస్థితి ఉంది.
అలాంటి టైంలో అఖండతో బాలయ్య తెలుగు సినిమా ప్రేక్షకుడికి మాత్రమే కాదు.. ఓవరాల్ ఇండస్ట్రీకే ఎంతో ధైర్యం ఇచ్చారు. అసలు అఖండ టిక్కెట్ రేట్లు తక్కువ ఉన్న సమయంలోనే భారీ లాభాలు కొల్లగొట్టింది. అఖండ సాధించిన అప్రతిహత విజయంతోనే తెలుగు సినిమా హీరోలు, నిర్మాతలు ధైర్యంగా తమ సినిమాలు రిలీజ్ చేశారు. ఇంకా చెప్పాలంటే అఖండ వసూళ్లు బాలయ్య కెరీర్లోనే టాప్.
ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – రామ్‌చరణ్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా సైతం ఏకంగా పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అవ్వడంతో పాటు రు. 1200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. త్రిబుల్ ఆర్ విజయం కూడా పాన్ ఇండియా లెవల్లో బ్లాక్‌బస్టర్ అవ్వడంతో పాటు కరోనా తర్వాత పాన్ ఇండియా సినిమాలకు మంచి ఊతం ఇచ్చింది. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ కెరీర్లో ఆల్ టైం రికార్డ్ మూవీ.
ఇక ఇప్పుడు కళ్యాణ్‌రామ్ బింబిసార వచ్చింది. జూన్‌లో మేజర్, విక్రమ్ తర్వాత రెండు నెలల పాటు టాలీవుడ్‌ను వరుసగా బిగ్గెస్ట్ ప్లాపులు పలకరించాయి. రవితేజ, రామ్, చైతు, గోపీచంద్ ఇలా కుర్ర హీరోలు చేసిన సినిమాలు అన్నీ ప్లాపే. అంతకు ముందు చిరు – చెర్రీ ఆచార్య, వరుణ్ తేజ్ గని కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇలాంటి టైంలో సీతారామంతో కలిసి బింబిసార మళ్లీ ఇండస్ట్రీకి ఊపిరిలూదింది.
బింబిసార కూడా కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే ఆల్ టైం రికార్డుగా నిలిచింది. ఇలా నందమూరి త్రిమూర్తులు కరోనా తర్వాత ఇండస్ట్రీకి ఊపిరిలూదడంతో పాటు రక్షకులుగా నిలిచారని.. ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది.