టైటిల్: సీతా రామం
బ్యానర్: వైజయంతీ మూవీస్ & స్వప్న సినిమాస్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, రష్మిక, తరుణ్ భాస్కర్, భూమిక, వెన్నెల కిషోర్, మురళీశర్మ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: పీఎస్. వినోద్, శ్రేయాష్ కృష్ణ
నిర్మాణం: స్వప్న సినిమాస్
రచన – దర్శకత్వం: హను రాఘవపూడి
సెన్సార్ రిపోర్ట్ : క్లీన్ యూ
రన్ టైం : 163 నిమిషాలు
రిలీజ్ డేట్: 5 ఆగస్టు, 2022
సీతా రామం టాలీవుడ్ సర్కిల్స్‌లో కొద్ది రోజులుగా బాగా ట్రెండ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా రష్మిక కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాను సంయుక్త ఆధ్వర్యంలో తెరకెకకింది. వైవిధ్యమైన సినిమాలు తీస్తాడన్న పేరున్న హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. అందమైన ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా వస్తోన్న ఈ సినిమాకు సీనియర్ హీరోలు విజయ్ దేవరకొండ, ప్రభాస్ ప్రమోషన్లు కూడా హెల్ఫ్ అయ్యాయి. కళ్యాణ్‌రామ్ బింబిసారకు పోటీగా ఇదే రోజు థియేటర్లలోకి వచ్చిన సీతా రామం పై ప్రేక్షకులు పెట్టుకున్న ఆ ఫీల్ ఎంత వరకు కనెక్ట్ అయ్యిందో TL సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
పాకిస్తాన్ నుంచి ఈ కథ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఓ ఉత్తరం గత 20 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది. అది లెఫ్ట్‌నెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం హైదరాబాద్‌లో ఉన్న సీతామహాలక్ష్మి కోసం చేరాల్సి ఉంటుంది. ఆ బాధ్యత అఫ్రిన్ ( రష్మిక)పై పడుతుంది. ఇది తాతయ్య ( సచిన్ ఖేద్కర్) ఆఖరి కోరిక. ఆ ఉత్తరం చేరాల్సిన చోటకు చేరితే తప్పా అఫ్రిన్‌కు ఆమెకు రావాల్సిన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదన్న కండీషన్ కూడా ఉంటుంది. అందుకే ఇష్టం లేకపోయినా ఆమె ఆ ఉత్తరం పట్టుకుని హైదరాబాద్‌కు వచ్చి ఒక్కొక్కరిని కలిసే క్రమంలో ఆమెకు చాలా షాకింగ్ విషయాలు తెలుస్తాయి.
లెఫ్ట్‌నెంట్ రామ్ ఓ అనాథ.. అంతకు మించి అతడి గురించి వివరాలేం ఉండవు. సీతామహాలక్ష్మి పేరుతో ఉత్తరాలు వస్తూ ఉంటాయి. రిప్లే ఇవ్వాలని అనుకుంటే చిరునామా ఉండదు. ఆ తర్వాత ఓ రోజు సీతామహాలక్ష్మిని రామ్ కలవడం.. చివరకు అది ప్రేమగా మారుతోన్న టైంలో ఇద్దరు మళ్లీ విడిపోతారు. సీతకోసం రామ్ రాసిన ఉత్తరం పాకిస్తాన్‌లో ఎందుకు ఉండిపోయింది… ఆ ఉత్తరాన్ని అఫ్రిన్ ఎవరికి ఇచ్చింది ? అసలు సీత – రామ్ ఎందుకు విడిపోయారు.. వారికి పెళ్లి జరిగిందా ? లేదా ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
TL విశ్లేషణ :
విశ్లేషణ విషయానికి వస్తే ఇది అందమైన ప్రేమకథ. ఇందులో దర్శకుడు కొన్ని ట్విస్టులు రాసుకుని ఆసక్తిగా తెరకెక్కించాడు. సెకండాఫ్‌లో అసలు కథ మొదలైన వెంటనే ఎమోషన్లు పీక్స్‌కు వెళతాయి. సీత నేపథ్యం తెలిశాక ఆమె పాత్రపై మనకు ప్రేమ మరింత ఎక్కువ అవుతుంది. రామ్ తనకు ఎవరైతే ఉత్తరాలు రాశారో వాళ్లను వెళ్లి కలవడం.. చివరకు ఓ చెల్లి దగ్గరకు వెళ్లి అన్నా బాధ్యత తీసుకోవడం హార్ట్ టచ్చింగ్‌గా ఉంది. విష్ణు శర్మ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. దేశం కోసం ప్రాణాన్ని, ప్రేమను త్యాగం చేస్తున్నప్పుడు లెఫ్ట్‌నెంట్ రామ్ ఎంత ఉన్నతంగా ఉంటాడో.. అతడి కోసం ఎదురు చూపులు చూస్తే బతికే సీతను చూస్తున్నప్పుడు కూడా మనకు అంతే గొప్పగా అనిపిస్తుంది.
ఇక రష్మిక చేసిన అఫ్రిన్ పాత్ర ముగింపు ఇచ్చిన తీరుకు మనం దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ పాత్ర అలా ముగించడంతోనే కథకు మరింత అందం వచ్చింది. సినిమాలో ప్రతి పాత్రను దర్శకుడు తెలివిగా వాడుకున్నాడనే చెప్పాలి. క్లైమాక్స్‌లో 30 నిమిషాలు సినిమా రేంజ్‌ను ముందుకు తీసుకు వెళ్లింది. అందమైన ప్రేమకథకు ఉద్వేగ భరిత ముగింపుతో సీతారామం ప్రేమకథ హార్ట్ టచ్చింగ్‌గా కొన్నాళ్ల పాటు ప్రేక్షకుల మదిని టచ్ చేస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే దుల్కర్ కథకు ప్రాణం పోస్తూ లెఫ్ట్‌నెంట్ రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. అతడి అందం, బిహేవియర్, యాట్యిట్యూడ్ ఇలా అన్నింటితోనూ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. దుల్కర్ తన కళ్లతోనే రొమాన్స్ చేశాడు. ఆ కళ్లలోనే ఒక్కోసారి ఉద్వేగం కూడా ఉంటుంది. ఇక మృణాల్ పాత్ర స్లోగానే కట్టి పడేస్తుంది. ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకున్నాక సీత పాత్రను ప్రేక్షకుడు పిచ్చగా ప్రేమించేస్తాడు. ఇక పొగరున్న అమ్మాయి పాత్రలో అఫ్రిన్ మెప్పించింది. సమంతది సర్‌ఫ్రైజింగ్ పాత్రే అని చెప్పాలి. ప్రతి చిన్న పాత్రకూ కూడా పేరున్న నటీనటలను తీసుకోవడం వాళ్లు చేసింది ఒక్క సీనే అయినా బాగా గుర్తుండిపోయేలా ఉంది.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
టెక్నికల్‌గా వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. 1965 – 1985 నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రేక్షకులను ప్రతి ఒక్క టెక్నీషియన్ ఆ కాలంలోకి తీసుకువెళ్లారు. సెట్లు, రియల్ లొకేషన్లు, పాటలు, కశ్మీర్ అందాలు ముగ్ధమనోహరం చేస్తాయి. దర్శకుడు హను రాఘవపూడి ప్రేమకథను అందంగా తీయడంలో మంచి నేర్పరి. ఈ సారి బలమైన కథతో పాటు అందులో విభిన్నమైన కోణాలు ఉండడం.. పైగా వైజయంతీ లాంటి సంస్థ బ్యాకప్ ఉండడం అతడికి మరింత బలం ఇచ్చింది. అయితే ఫస్టాఫ్‌లో ప్లాట్ నెరేషన్, స్లో నరేషన్ కొంత బోర్ కొట్టించింది. సెకండాఫ్‌లో మాత్రం ఎమోషన్లను పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్లాడు. చివరకు క్లైమాక్స్ కూడా ఎమోషనల్‌గానే ముగించాడు. అయితే స్లో నెరేషన్ మాత్రం కొందరిని ఇబ్బంది పెడుతుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్ని బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో స్లో నెరేషన్ కంప్లైంట్ ఉన్నా అది కథానుసారం చూడాలే తప్పా అతడిని తప్పుపట్టలేం. వైజయంతీ సంస్థ పేరు పెంచే సినిమాల్లో సీతారామం కూడా ఒకటి.
ఫైనల్‌గా…
ప్రేమకథలకు అర్థం మారిపోయిన ఈ రోజుల్లో ఎక్కడా వెగటు లేకుండా.. ఒక్క ముద్దుసీన్, డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా హృద్యంగా తెరకెక్కిన సీతారామం సినిమా క్లాస్ ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. మాస్ వర్గాలకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో ? చూడాలి. ఈ అందమైన ప్రేమకథకు స్లో నెరేషన్.. ఫస్టాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్లు మినహా పెద్దగా కంప్లైంట్స్ కూడా ఉండవు.
ఫైనల్ పంచ్ :
సీత రామ్‌ల అందమైన ప్రేమకథ
సీతా రామం TL రేటింగ్ : 3 / 5