ఆమని 1990వ దశకంలో కుటుంబ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్. శుభలగ్నం – శుభసంకల్పం – మిస్టర్‌పెళ్లాం – సిసింద్రీ లాంటి సినిమాలు చేసింది. శుభలగ్నం సినిమాలో డబ్బుకు ఆశపడి భర్తను అమ్ముకునే క్యారెక్టర్లో ఆమె జీవించేసింది. ఆ సినిమా తర్వాత ఆమని ప్రతి తెలుగు ఇంటి మహిళలకు గుర్తుండిపోయింది. బాపు, కె. విశ్వనాథ్ లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా ఆమన అంటే సంప్రదాయ బద్ధమైన క్యారెక్టర్లు చేస్తుందని ఎంతో ఇష్టపడ్డారు.
దివంగత కన్నడ నటి సౌందర్య, ఆమని బెస్ట్ ఫ్రెండ్స్. ఆమని కూడా కన్నడ కస్తూరీయే. ఆమె అసలు పేరు మంజుల. వీరి పూర్వీకులు కూడా తెలుగు వారే. అనంతపురం జిల్లాకు చెందిన వారు. తర్వాత కాలంలో వాళ్లు కర్నాటక వెళ్లి బెంగళూరులో సెటిల్ అయిపోయారు. పెళ్లి తర్వాత చెన్నైలో సెటిల్ అయిన ఆమని సెకండ్ ఇన్సింగ్స్‌లో మంచి పాత్రలే చేస్తూ వస్తోంది.
ఇటీవలే అక్కినేని అఖిల్ సినిమాలో కూడా ఆమని నటించింది. ఇక తన మేనకోడలు హ్రితిక నటించిన సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆమని దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా చేయాలన్న కోరిక ఉందని తన మనసులో మాట బయట పెట్టింది. అయితే ఆమని మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది. అదేంటి అనుకుంటున్నారా ? ఇది నిజమే. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆమనికి ఎంతో ఇష్టం.
అప్పటి తరం స్టార్ హీరోలు అందరితోనూ నటించిన ఆమని.. మెగాస్టార్ పక్కన మాత్రం హీరోయిన్గా చేయలేకపోయింది. ఆ తర్వాత ఆమనికి చిరు పక్కన చెల్లి క్యారెక్టర్ వచ్చిందట. చేస్తే చిరు పక్కన హీరోయిన్‌గానే చేయాలే తప్పా.. చెల్లిగా ఏంటి.. చీ అసలు ఆ క్యారెక్టర్లో తనను తాను ఊహించుకోలేనని చెప్పి ఆమె రిజెక్ట్ చేసింది. అలా ఆమని – చిరు కాంబినేషన్ సెట్ కాలేదు.