పవర్‌స్టార్ పవన్ కళ్యాన్‌కు డబ్బుల కోసం సినిమాలు కావాలి… అటు రాజకీయాలు కూడా ముఖ్యమే. వచ్చే ఎన్నికలు పవన్‌కు చావో రేవో లాంటివి. ఇటు సినిమాలకు ఫుల్ టైం డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు.. ఇప్పటికే చాలా మంది దగ్గర అడ్వాన్స్‌లు తీసుకుని.. చాలా సినిమాలు కమిట్ కావడంతో పాటు డైరెక్టర్లకు కూడా ఓకే చెప్పేశాడు. మరోవైపు ఏపీలో ఎన్నికలు తరుముకొస్తుండడంతో ప్రజల్లోకి వెళ్లాల్సిన టైం కూడా వచ్చేసింది.
దీంతో పవన్ ఇటు సినిమాలు చేసేందుకు టైం లేక తనను నమ్ముకున్న వాళ్లందరిని బాగా ఇబ్బంది పెట్టేస్తోన్న పరిస్థితే ఉంది. ఇటు పవన్ సినిమాల కోసం అర్రులు చాస్తోన్న అభిమానులను కూడా నిరాశపరుస్తున్నాడు. పవన్ ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్ డైరెక్టర్లను ఇరుకులో పెట్టేశాడు. మెఘల్ కాలం నాటి చారిత్రక కథతో వస్తోన్న హరిహర వీరమల్లు సినిమా భారీ బడ్జెట్తో వస్తోంది.
అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియక దర్శకుడు క్రిష్‌తో పాటు నిర్మాత ఏఎం. రత్నంకు కూడా తెలియడం లేదు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ డేట్లు ఇవ్వకపోవడంతో నిర్మాత రత్నం సైతం హైదరాబాద్‌లో వేసిన సెట్లకు అద్దెలు చెల్లిస్తూ ఎదురు చూపులు చూడడం మినహా చేసేదేం లేదు. క్రిష్‌కు, రత్నం విసిగిపోయి ఉన్నారని తెలుస్తోంది.
అటు భవదీయుడు భగత్‌సింగ్ ఫిక్స్ అయిపోయిందని యేడాదిగా ఊరేగుతున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇక పవన్ ఇప్పట్లో తనకు డేట్లు ఇవ్వడని డిసైడ్ అయ్యి ఇప్పుడు రామ్‌తో దాదాపు ఫిక్స్ అయిపోయాడు. హరీష్ శంకర్ పవన్ ఎప్పుడు డేట్లు ఇస్తాడో తెలియక ఆరేడు నెలలుగా కాళ్లు అరిగేలా తిరిగి విసిగిపోవడంతో పాటు తన బాధ సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోయిన పరిస్థితి.
ఇక సముద్రఖని దర్శకత్వంలో సాయితేజ్‌తో కలిసి తాను చేసే సినిమాకు 28 రోజుల కాల్షీట్లు ఇచ్చాడని.. ఈ సినిమా షూటింగ్ రెండు నెలల్లో పూర్తవుతుందని ఒక్కటే ఊదరగొట్టేశారు. జూలై 10 నుంచి షూటింగ్ అన్నారు. తన సినిమా అయ్యేవరకు మరో సినిమా చేయవద్దని సాయితేజ్‌కు పవన్ స్వయంగా డెడ్ లైన్లు కూడా పెట్టారు. పాపం సముద్రఖని నటుడిగా తాను చేయాల్సిన సినిమాలు వదులుకుని పవన్ ఎప్పుడు వస్తాడా ? అని వెయిట్ చేస్తున్నా పవన్ కనికరించడం లేదు.
పోని ఇప్పట్లో తాను డేట్లు ఇవ్వలేనని చెప్పినా పర్వాలేదు. కానీ అటూ ఇటూ అంటూ ఏదీ సరైన క్లారిటీ ఇవ్వకుండా పవన్ తనను నమ్ముకున్న నిర్మాతలు, డైరెక్టర్లనే కాదు చివరకు సాయితేజ్ లాంటి వాళ్లను కూడా ఇరకాటంలో పడేసి ఇరికించేస్తోన్న పరిస్తితి.