టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నూనుగు మీసాల వయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 21 సంవత్సరాలకే సింహాద్రి లాంటి బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 21 ఏళ్లకే అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులు బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. తారక్ తొలి సినిమా నిన్ను చూడాలని. 2001లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో రవీనా రాజ్‌పుత్ హీరోయిన్. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.
అయితే ఈ సినిమా కంటే ముందే 1997లో అందరూ పిల్లలతో తీసిన బాల రామాయణం సినిమాలో ఎన్టీఆర్ నటించాడు. ఈ సినిమాను ఎంఎస్. రెడ్డి నిర్మించగా.. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాలోనే ఎన్టీఆర్ తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్.. ఇలా ప్రతి దానిలోనే దీ బెస్ట్ పెర్పామెన్స్ ఇచ్చాడు. బాల రామాయణం సినిమాకు ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్ అందుకున్నాడు. అంతకుముందే ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా కనిపించాడు.
ఇక 2001లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ యేడాది మొత్తం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్ను చూడాలని యావరేజ్ అవ్వగా.. ఆ వెంటనే వచ్చిన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో గజాలా హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ రెండో సినిమాతోనే ఎన్టీఆర్ వెనక్కు తిరిగి చూసుకోనంత స్టార్ అయిపోయాడు.
ఆ తర్వాత అదే యేడాది డిసెంబర్లో సుబ్బు సినిమా వచ్చింది. డిసెంబర్ 21న రిలీజ్ అయిన సుబ్బు సినిమాలో సోనాలి జోషి హీరోయిన్. సురేష్ వర్మ దర్శకుడు. సుబ్బు సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. ఇక నిన్ను చూడాలని సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ వయస్సు 17 ఏళ్లు మాత్రమే. 2000 నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 2001 మే 25న నిన్ను చూడాలని రిలీజ్ అయ్యింది. తొలి సినిమాకు గాను ఎన్టీఆర్ అందుకున్న రెమ్యునరేషన్ అక్షరాలా నాలుగు లక్షలు.
ఉషాకిరణ్ వాళ్లు ఇచ్చిన ఈ అమౌంట్‌ను ఎన్టీఆర్ ఏం చేయాలో తెలియక తీసుకువెళ్లి తన అమ్మ చేతిలో పెట్టాడట. అయితే తొలి సినిమాకు రు. 4 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్న ఎన్టీఆర్ రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1కే రెమ్యునరేషన్‌తో పాటు క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రు. 50 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.