మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత గోపీచంద్‌కు కమర్షియల్‌గా ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎట్టకేలకు ఈ సినిమాతో గోపీచంద్ ఫామ్‌లోకి వచ్చాడు. గోపీచంద్ తన భార్య రేష్మీ, ఇద్దరు పిల్లలతో తన వ్యక్తిగత జీవితాన్ని చక్కగా డిజైన్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక గోపీచంద్ పర్సనల్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. గోపీచంద్ ఎదుర్కొన్న కష్టాలు చూస్తే ఎంతటివారికైనా కన్నీళ్లు ఆగవు. గోపీచంద్ తండ్రి దివంగత టి. కృష్ణ. అప్పట్లో టి. కృష్ణ సినిమాలు అంటే సంచలనం. ఈ తరం ఫిలింస్ బ్యానర్‌పై విప్లవాత్మక సినిమాలు తెరకెక్కించడంలో టి. కృష్ణది అందెవేసిన చేయి. సమాజాన్ని ఆలోచింపజేసేలా ఆయన సినిమాలు ఉండేవి.
ప్రతిఘటన సినిమా అయితే అప్పట్లో ఏకంగా సంవత్సరం పాటు ఆడి ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. టి. కృష్ణ శిష్యుల్లో ఆ తర్వాత చాలా మంది స్టార్ డైరెక్టర్లు అయ్యారు. విజయశాంతికి టి. కృష్ణ సినిమాలతోనే లేడీ అమితాబ్ అన్న బిరుదు స్థిరపడిపోయింది. ఇక ఆ తర్వాత తేజ లాంటి వాళ్లు ఆయన శిష్యరికం నుంచి వచ్చి స్టార్ డైరెక్టర్లు అయ్యారు. అయితే చిన్న వయస్సులోనే ఎంతో భవిష్యత్తు ఉండగానే ఆయనకు క్యాన్సర్ రావడంతో మృతిచెందారు.
తన తండ్రి చనిపోయే టైంకు గోపీచంద్ వయస్సు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. అయితే ఈ 9 ఏళ్లలో కూడా తండ్రికి ఎక్కువుగా దూరంగా ఉండడం… చదువుకునేందుకు బయటే ఉండాల్సి రావడంతో తనకు అంత అనుబంధం కూడా ఏర్పడలేకపోయిందని ఎన్నో సందర్భాల్లో గోపీచంద్ బాధపడ్డాడు. ఆ తర్వాత గోపీచంద్ అన్నయ్య ముత్యాల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్‌గా చేరి తర్వాత డైరెక్టర్ అవ్వాలని కలలు కనేవాడు.
అయితే దురదృష్టవశాత్తు గోపీచంద్ అన్నయ్య యాక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పటి వరకు అసలు గోపీచంద్‌కు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన కూడా లేదు. నాన్న వారసత్వం నిలబెట్టేందుకు అన్నయ్య ఉన్నాడులే.. తాను బిజినెస్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఉండేవాడట. ఎప్పుడు అయితే అన్నయ్య చనిపోయాడో అప్పుడు నాన్న వారసత్వాన్ని నిలబెట్టేందుకు తాను సినిమా ఫీల్డ్‌లోనే ఉండాలని డిసైడ్ అయ్యాడట.
ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలివలపు సినిమా చేస్తే యావరేజ్ అయ్యింది. ఆ తర్వాత జయం, నిజం సినిమాల్లో విలన్‌గా చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ నుంచి గోపీచంద్ ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.