నటరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అఖండ వెండితెర బ్లాక్‌బస్టర్. అన్‌స్టాపబుల్ బుల్లితెర బ్లాక్‌బస్టర్. ఇక బాలయ్య నెక్ట్స్ లైనప్ చూస్తే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మలినేని గోపీచంద్ – అనిల్ రావిపూడి – బోయపాటి శ్రీను – పూరి జగన్నాథ్ ఇలా స్టార్ డైరెక్టర్లే బాలయ్యతో సినిమాలు చేసేందుకు క్యూలో ఉన్నారు.
ఇక బాలయ్యను ఆయన అభిమానులే కాదు. తెలుగు సినీ లవర్స్ కూడా చాలా ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. యువరత్న – నందమూరి నటసింహం – బాక్సాఫీస్ బొనంజా – గోల్డెన్ స్టార్ – బాలయ్య – లయన్ ఇలా చాలా పేర్లే బాలకృష్ణకు ముద్దుపేర్లుగా ఉన్నాయి. ఇక ఆయన్ను ఎక్కువుగా బాలయ్య అని పిలిచేవాళ్లే ఉంటారు. ఆ తరం జనరేషన్ నందమూరి అభిమానుల నుంచి నేటి తరం అభిమానుల వరకు బాలయ్యే అంటుంటారు.
ఇక రీసెంట్‌గా జై బాలయ్య అన్న నినాదం ఎక్కడ చూసినా కామన్ అయిపోయింది. అది బాలయ్య ఫంక్షనో, ఎన్టీఆర్ సినిమా ఫంక్షనో.. నందమూరి వాళ్ల ఫంక్షనో మాత్రమే కాదు.. ఏ హీరో ఫంక్షన్లో అయినా.. మరే హీరో సినిమా ఆడుతున్న థియేటర్లలో అయినా ఈ జై బాలయ్య నినాదం కామన్ అయిపోయింది. ఇక చిన్న హీరోల సినిమాల్లో కూడా జై బాలయ్య అనో లేదా బాలయ్య పేరును ఏదోలా వాడేయడం కూడా మామూలు అయిపోయింది.
ఇక రీసెంట్ బ్లాక్‌బస్టర్ అఖండ లో అయితే ఏకంగా జై బాలయ్యా సాంగ్ పెట్టడం.. ఆ సాంగ్ ఆ సినిమా విజయంలో ఎంత హైలెట్ అయ్యిందో చూశాం. అసలు బాలకృష్ణకు బాలయ్య అన్న ముద్దు పేరు ఎలా వచ్చింది ? దీని వెనక స్టోరీ ఏంటో చూస్తే ఇంట్రస్టింగ్ అనిపిస్తుంది. బాలయ్య – బి. గోపాల్ కాంబినేషన్ అంటేనే వెరీ ఇంట్రస్టింగ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో నాలుగు హిట్ సినిమాలు వచ్చాయి.
ముందు లారీడ్రైవర్ ఆ తర్వాత రౌడీఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలు వచ్చాయి. లారీడ్రైవర్ సినిమా టైంలో జొన్నవిత్తుల పాట రాస్తున్నప్పుడు డైరెక్టర్ బి. గోపాల్ మీరు పాట ఏమైనా రాసుకోండి.. పాటలో మాత్రం బాలయ్య అన్న పదం వినిపించాలని చెప్పారట. వెంటనే జొన్నివిత్తుల బాలయ్య బాలయ్యా.. గుండెల్లో గోలయ్యా జో కొట్టాలయ్యా అని రాశారు.
ఆ పాట సినిమాలో సూపర్ హిట్ అయిపోయింది. చక్రవర్తి కంపోజ్ చేసిన స్వరాలు అదిరిపోయాయి. ఈ సినిమా వచ్చి మూడు దశాబ్దాలు దాటుతున్నా కూడా ఆ బాలయ్య అన్న పదమే ఆయన ముద్దుపేరుగా స్థిరపడిపోయింది. ఇక మళ్లీ ఇన్నేళ్లకు జై బాలయ్య సాంగ్ వచ్చి అది కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు జై బాలయ్య అంటేనే చాలా మందికి అదో ఎనర్జీ అయిపోయింది.