అన్నగారు.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు.. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక.. ఎన్టీఆర్. ఆయన అనేక పాత్రలు పోషించారు. రాజు నుంచి పేద వరకు, బృహన్నల నుంచి జానపదం వరకు.. ఇలా అనేక పాత్రలు అన్నగారి కోసమే పుట్టాయా? అన్నట్టుగా ఆయన అభినయం ఉండేది. అయితే.. అన్నగారు నటనకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. అదే సమయంలో ఆయన డైలాగులకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. అచ్చ తెలుగు డైలాగులకు ఆయన పెద్ద పీట వేస్తారు.
ఇక ఎంత పెద్ద డైలాగ్ అయినా ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో ఎలా చెపుతారో తెలిసిందే. ఎన్టీఆర్ రేంజ్లో డైలాగులు చెప్పే నటుడు దేశం మొత్తం మీద ఇప్పటకీ లేడంటే అతిశయోక్తి కాదు. ప్రతినాయకుడిని తిట్టాల్సిన సందర్భంలోనూ.. అచ్చతెలుగు తిట్లనే ఆయన ఎంచుకునేవారు. ఇక, పౌరా ణిక, జానపద సినిమాల్లో అయితే.. అన్నగారి స్టయిలే వేరు. ఆయన వాచకం, అభినయం.. అంతా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
ఇలా ఆహారం, డైలాగులు… ప్రతి విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకునేవారు. ఆయన సొంతగా నిర్మించిన సినిమాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకునేవారు అన్నగారు. ఇలాంటి సినిమాల్లో ఒక ఆణిముత్యమే.. దానవీరశూరకర్ణ!! ఈ సినిమా ఆద్యంతం.. కర్ణుడికి పట్టంకట్టింది. కర్ణుడి చరిత్రను.. తెలుగు వారికి సంపూర్ణంగా పరిచయం చేసింది. అయితే. అన్నగారు ఈ సినిమాకు దర్శకుడిగా, నిర్మాతగా.. కూడా వ్యవహరించారు.
ఇక, అచ్చ తెలుగుకు ఆయన పట్టాభిషేకం చేసిన సినిమాల్లో ఇది కీలకమైన మూవీ అనడంలో అతిశయోక్తి లేదు. నాటి.. భాషకు తగిన విధంగా.. నాటి కథనానికి తగిన విధంగా అన్నగారు.. సినిమాను మలిచారు. ఈ క్రమంలో డైలాగులకు పెద్ద పీట వేశారు. తిరుపతి వెంకట కవుల రచన కోసం.. సినిమాను మూడు నెలల పాటు.. వాయిదా వేసుకున్నారు. ఇలా అంకిత భావంతో తీసిన సినిమా కాబట్టే.. దానవీరశూరకర్ణలో ప్రతి డైలాగులోనూ.. తెలుగుతనం ఉట్టిపడుతుంది.. ప్రతి విషయంలో కళాత్మకత కళ్లకు కడుతుంది. దటీజ్ అన్నగారు.