తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వంశ హీరోలకు అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకులలో ఉన్న ప్రత్యేకత ఏపాటిదో అందరికీ తెలిసిందే. నందమూరి తారకరామారావు నటుడిగా అగ్ర స్థానంలో నిలిచారు. కేవలం నటుడుగానే కాక దర్శకనిర్మాతగానూ ఆయన సత్తా ఎంతటిదో ప్రపంచానికి చూపించారు. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, రావణుడైన, శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ అవతారం అయినా తారకరాముడు, అన్న ఎన్.టి.ఆర్ తర్వాతే ఎవరైనా అని ప్రతీ ఒక్కరు చెప్పున్నారంటే అతిశయోక్తి కాదు.
ఆయన సినిమా అంటే సినిమా హాళ్ళు దేవాలయాలయ్యేవి. మద్రాసులో ఉన్నప్పుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ ప్రత్యేకంగా మద్రాసు వెళ్ళి ఎన్.టి.ఆర్ దర్శన భాగ్యం కోసం పడిగాపులు కాచేవారు. అంతటి ఆరాధ్యదైవగంగా నిలిచారు. సీనియర్ నటీ నటులందరితోనూ తెరను పంచుకున్న ఆ ఎన్.టి.ఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, రామకృష్ణలతోనూ కలిసి వెండితెరపై అలరించారు. సీనియర్ నటీమణి భానుమతి రామకృష్ణ ఎన్.టి.ఆర్ సరసన నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు.
ఇద్దరూ ఒకరికి ఒకరు ఎంతగానో గౌరవించుకున్నారు. ఆ తర్వాత కాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలో భానుమతి గారు బాలయ్యకు బామ్మగా నటించారు. అయితే, ఈ సినిమా దర్శకుడు కోడిరామకృష్ణ మంగమ్మగారి మనవడు సినిమా అనుకున్నప్పుడు హీరోగా బాలకృష్ణను ఆయనకు బామ్మగా భానుమతి గారినే ఎలాగైనా తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ, భానుమతిగారు ముందు సినిమా చేయడానికి కాస్త ఆలోచించారట. కథ మొత్తం విన్న తర్వాత హీరో పాత్ర ఎవరు వేస్తున్నారూ అంటూ నిట్టూర్పుగా కోడి రామకృష్ణను అడిగారట భానుమతి.
బాలకృష్ణ అమ్మా అని కోడి రామకృష్ణ చెప్పగా ఓ..ఆ పెద్దాయన కొడుకా..సరే నేనిప్పుడు ఆ పిల్లాడికి బామ్మగా చేయాలా..అట్లాగే చేద్దాంలే అని ఎన్.టి.ఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ బాలకృష్ణకు బామ్మగా నటించేందుకు భానుమతి గారు ఒప్పుకున్నారు. ఈ విషయాలను స్వయంగా దర్శకుడు కోడి రామకృష్ణ పలుమార్లు మాటల సందర్భంలోనూ…అప్పుడప్పుడూ ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. ఇక బాలయ్య – కోడి రామకృష్ణలది సూపర్ హిట్ కాంబినేషన్ అని అందరికీ తెలిసిందే.
వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక బాలయ్యకు కమర్షియల్‌గా తొలి బ్రేక్ ఇచ్చింది కూడా కోడి రామకృష్ణ సినిమాలే. మంగమ్మగారి మనవడు సినియా అయితే ఏకంగా హైదరాబాద్ జంట నగరాల్లో మూడు థియేటర్లలో సంవత్సరం పాటు ఆడింది. అప్పట్లో ఇదో సెన్షేషనల్ రికార్డ్.