బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. ఈ పేరు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశం మొత్తానికీ తెలిసిన పేరు. ఎందుకంటే.. కేన్సర్‌కు మెరుగైన చికిత్సను అందిస్తూ.. ముందున్న సంస్థగా ఇది పేరు తెచ్చుకుంది. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో పేదలకు కేన్సర్ చికిత్స అందించే హాస్పటల్స్‌లో ఆ హాస్పటల్ ర్యాంక్ 2. దీనిని బట్టే ఈ హాస్పటల్‌కు ఎలాంటి పేరు ఉందో తెలుస్తోంది. పైగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నగారు.. ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని స్థాపించారు. దీనికి ఏర్పాటుకు ప్రధాన కారణం.. చాలా మందికి తెలియక పోవడం గమనార్హం.
బసవ రామ తారకం నందమూరి తారక రామారావు సతీమణి. బసవతారకానికి ఎన్.టి.రామారావుతో తో 1942 మే నెలలో వివాహం జరిగింది. బసవతారకం ఎన్టీఆర్ కి మేనమావ కూతురు. వీరికి 12 మంది సంతానం. అయితే.. 1985లో గర్భకోశ కాన్సర్ వ్యాధితో బసవ రామ తారకం మరణించారు. అప్పటికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే.. అదే సమయంలో నాదెండ్ల భాస్కరరావు పరిణామాలతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ సమయంలోనే బసవరామ తారకం మృతి చెందారు.
అయితే.. భార్యపై ఉన్న అనురాగంతో.. ఎన్టీఆర్.. ఆమెకు ఎలానూ సరైన వైద్యం అందించలేక పోయాననే ఆవేదన చెంది.. తెలుగు రాష్ట్రంలో ఎవరూ.. కేన్సర్‌తో మరణించకూడదనే సంకల్పంతో కేన్సర్ ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు. బసవరామ తారకం మృతి చెందేటప్పుడు కూడా కేన్సర్‌తో ఎవ్వరూ చనిపోకుండా ఓ హాస్పటల్ కట్టాలని కోరారు. ఈ క్రమంలోనే బసవ రామ తారకం జ్ఞాపకార్థం హైదరాబాదులో బసవతారకం ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.
అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీఆర్ ఈ కేన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌ను 1988లో స్థాపించారు. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ యుఎస్ఎ సహకారంతో బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియా.. 22 జూన్ 2000న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించింది. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి ఈ హాస్పిటల్‌ను ప్రారంభించారు.
కేన్సర్ వైద్యంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఈ హాస్పిటల్ రెండు దశాబ్దాలకు పైగా ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 2.5 లక్షల వరకు క్యాన్సర్ రోగులకు చికిత్స అందించారు. హాస్పిటల్ ప్రారంభ రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మాజీ స్పీకర్ దివంగత డాక్టర్ కోడెల శివప్రసాద్, డాక్టర్ తులసీదేవి పోలవరపు, డాక్టర్ నోరి దత్తా త్రేయుడువంటి ఎంతో మంది తొలిరోజుల్లో ఈ ఆసుపత్రిని దిగ్విజయంగా ముందుకు నడిపించడం గమనార్హం.