Reviewsవిజయ్ దేవరకొండ చెప్పినట్టే అర్జున్ రెడ్డి కొట్టాడు..!

విజయ్ దేవరకొండ చెప్పినట్టే అర్జున్ రెడ్డి కొట్టాడు..!

పెళ్లిచూపులు సినిమాతో బాగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ నటించిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో షాలిని హీరోయిన్ గా నటించింది. ఈమధ్య కాలంలో ప్రమోషన్స్ తో అందరి దృష్టిలో పడిన అర్జున్ రెడ్డి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మీద బీభత్సమైన కాన్ఫిడెన్స్ చూపించిన విజయ్ దేవరకొండ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకున్నాడు ఈ సమీక్షలో చూద్దాం.

కథవిషయానికొస్తే.. మెడికల్ స్టూడెంట్ అయిన అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) విపరీతమైన కొపం యాటిట్యూడ్ కలిగిన వ్యక్తి. తనకు నచ్చిన దాని కోసం ఏదైనా చేసే అర్జున్ రెడ్డి తన జూనియర్ అయిన ప్రీతి (షాలిని)ని చూసి ప్రేమిస్తాడు. అర్జున్ రెడ్డిని షాలిని ఇష్టపడుతుంది. అయితే ఈ ఇద్దరి ప్రేమను మాత్రం పెద్దలు ఒప్పుకోరు. ప్రీతి తండ్రి అర్జున్ రెడ్డి నుండి ప్రీతిని విడదీసి తన కులపు అబ్బాయిని ఇచ్చి పెళ్లిచేస్తాడు. ఇక ప్రేమ విఫలమవడంతో విరహ వేదనతో జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ప్రీతి జ్ఞాపకాల నుండి అర్జున్ రెడ్డి తనని తాను ఎలా బయటపడేలా చేసుకున్నాడు అన్నది సినిమా కథ.

నటీనటుల విషయానికొస్తే.. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ అదరగొట్టాడని చెప్పొచ్చు. ఇచ్చిన పాత్రకు తను నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. తప్పకుండా విజయ్ కెరియర్ కు అర్జున్ రెడ్డి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక షాలిని పాండే తన పాత్ర వరకు బాగానే చేసింది. రాహుల్ రామకృష్ణ కామెడీ పర్వాలేదు. ప్రియదర్శి కొద్దిసేపు అలరించాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు చేశారు.

అర్జున్ రెడ్డి టెక్నికల్ టీం విషయానికొస్తే.. రాధన్ మ్యూజిక్ బాగుంది.. సినిమా ఫీల్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. రాజు తోట సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తం సినిమా సెట్స్ లేకుండా నాచురల్ గా తీశారనిపిస్తుంది. శశాంక్ ఎడిటింగ్ ఓకే. సెకండ్ హాఫ్ ట్రిం చేస్తే బాగుండేది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి కథ కథనాల్లో సత్తా చాటినా అక్కడక్కడ సినిమా బోర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా డ్యూరేషన్ కాస్త ఇబ్బంది పెట్టే అంశం. మొదటి భాగం బాగుంది. సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదు కాని ఎక్కువ లాగుతున్న భావన కలుగుతుంది. క్లైమాక్స్ కూడా కాస్త నిరాశ పరుస్తుంది.

చిత్రయూనిట్ ఎవరినైతే టార్గెట్ చేసుకుందో అలాంటి యూత్ కు నచ్చే అంశాలతో వచ్చింది ఈ అర్జున్ రెడ్డి. కచ్చితంగా యూత్ కు కనెక్ట్ అవుతుంది. ఇక లవ్ ఫెయిల్యూర్ గా చూసుకుంటే ఇది ఈతరం దేవదాసుగా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ చెప్పలేం.. బి,సి సెంటర్స్ లో కూడా సినిమా కష్టమే అని అంటున్నారు.

రేటింగ్ : 3/5

బాటం లైన్ : అర్జున్ రెడ్డి చెప్పినట్టే కొట్టాడు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news