టాలీవుడ్లో నందమూరి, అక్కినేని కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెంటు కుటుంబాల ఇండస్ట్రీకి రెండు మూలస్తంభాలు. నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, అక్కినేని ఫ్యామిలీలో ఏఎన్నార్ వేసిన బీజంతో ఇప్పటకీ ఈ రెండు కుటుంబాల నుంచి మూడో తరం హీరోలు కూడా వచ్చి సక్సెస్ అవుతున్నారు. రెండో తరంలో ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య, ఏఎన్నార్ వారసుడిగా నాగార్జున వచ్చి స్టార్ హీరోలుగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు.
మూడో తరంలో నందమూరి వంశంలో కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ ఉంటే.. అటు అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ్ ఇద్దరు కుమారులు హీరోలు అయ్యారు. అయితే ఏఎన్నార్ కుటుంబం నుంచి ఆయన మనవరాలు ( కుమార్తె కూతురు) యార్లగడ్డ సుప్రియ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హీరో యార్లగడ్డ సుమంత్ సోదరి అయిన సుప్రియ పవన్‌కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అది పవన్‌కు కూడా తొలి సినిమాయే.
అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకులు. తొలి సినిమాతో సుప్రియకు మంచి పేరు వచ్చినా.. ఆ తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. మధ్యలో అప్పుడప్పుడు బుల్లితెరపై మెరిసింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అడవిశేష్ గూఢచారి సినిమాతో మళ్లీ వెండితెరపై మంచి పాత్రలో కనిపించింది. ఎందుకో గాని సుప్రియ, అటు అన్న సుమంత్ ఇద్దరి వ్యక్తిగత జీవితాలు కలిసి రాలేదు. సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమ వివాహం చేసుకుని యేడాదికే ఆమెతో విడిపోయాడు.
ఇటు సుప్రియ కూడా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో వచ్చిన ఇష్టం సినిమా హీరో చరణ్ రెడ్డి ( ఈ సినిమాయే శ్రీయకు తొలిసినిమా) తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అయితే చరణ్‌తో ఆమె విడిపోవడం.. అనారోగ్యంతో చరణ్ చనిపోవడం కూడా జరిగింది. ఇక సుప్రియ ఆలీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సుప్రియ ఆసక్తికర విషయాలే పంచుకుంది. నిర్మాతగా సక్సెస్ అయ్యారు కదా ? అని ప్రశ్నిస్తే.. ఆర్టిస్ట్‌గా సక్సెస్ అయ్యానని తాను అనుకోవడం లేదని చెప్పింది.
తొలి సినిమా హిట్ అయినా కూడా తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చినా ఎందుకో భయం అన్న ఫీలింగ్‌తో తాను తర్వాత సినిమాలు చేయలేదని చెప్పింది. తమ ఫ్యామిలీలో మగ, ఆడ అన్న తేడా లేకుండా అందరం మోడ్రన్‌గానే పెరిగాం అని.. తాను హీరోయిన్ అయ్యాక కాని అమ్మాయిలు, అబ్బాయిలు వేరన్న విషయం తనకు తెలియలేదని చెప్పింది. తన తొలి సినిమా షూటింగ్లో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఓ సారి ఏంటమ్మా ఇంత డల్‌గా ఉన్నావ్ అని అడిగితే.. ఏడుపు సీన్ కదా సార్ డల్‌గా ఉంటేనే బాగుంటుంది అని అంటే.. నువ్వు నాకు ఇప్పుడు డైరెక్షన్ నేర్పిస్తావా… వెళ్లి బ్రైట్ కలర్ డ్రెస్ వేసుకుని రా అన్నారట.
దీంతో అమ్మాయిలు ఉంది సినిమాల్లో కలర్ఫుల్గా కనిపించడానికేనా ? అన్నది తనకు అర్థమైందని.. ఎంతైనా హీరో వేరు… హీరోయిన్ వేరు అని సుప్రియ చెప్పుకువచ్చింది. ఇక తన తొలి సినిమా హిట్ అయ్యాక తనకు మైనా అనే సినిమాలో హీరోయిన్గా ఆఫర్ వచ్చిందని.. అలాగే నందమూరి బాలకృష్ణ పక్కన కూడా హీరోయిన్ ఆఫర్ వచ్చిందని సుప్రియ చెప్పింది. అయితే తొలి సినిమా తర్వాత ఎందుకో సినిమాలు చేయాలన్న కోరిక లేకపోవడంతో ఆపేయాల్సి వచ్చిందని చెప్పింది.
ఒకవేళ సుప్రియ బాలయ్యకు జోడీగా నటించి ఉంటే ఆ సినిమాకు ఖచ్చితంగా చరిత్ర పుటల్లో స్థానం ఉండేది. అటు ఎన్టీఆర్ వారసుడు.. ఇటు ఏఎన్నార్ మనవరాలు కలిసి జోడీగా నటించిన సినిమాగా రికార్డుల్లో పదిలం అయ్యి ఉండేది. ఇక ఏఎన్నార్ – బాలయ్య కలిసి నటించినా.. ఎన్టీఆర్ – నాగార్జున కాంబినేషన్లో మాత్రం సినిమా రాలేదు. అయితే నాగార్జున ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణతో కలిసి సీతారామరాజు సినిమా చేశాడు.