తెలుగు సినిమా రంగంలో ప్రస్తుతం వారసుల రాజ్యం నడుస్తోంది. నందమూరి, అక్కినేని వంశాల నుంచి ఏకంగా మూడో తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇక ఘట్టమనేని, దగ్గుబాటి వంశాల నుంచి రెండో తరం హీరోలు వచ్చారు. అసలు తెలుగు సినిమా రంగంలో ఈ వారసుల ఎంట్రీ వెనక ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. సినీ రంగంలో వారసులకు తాంబూలం ఎవరు ఇచ్చారు ? అప్పటి వరకు లేని సంస్కృతిని ఎవరు తీసుకువచ్చారు? ఇది మంచైనా .. చెడైనా.. ఎవరు దీనికి మూలం అంటే.. అన్నగారు ఎన్టీఆరే. ఎన్టీఆర్ తన పిల్లలను రంగ ప్రవేశం చేయించి.. వెండి తెరకు పరిచయం చేసే వరకుకూడా.. ఎవరూ.. తమ తమ వారసులను తీసుకురాలేదు.
అంతకు ముందు సినీ రంగంలో ఉన్న ఎస్వీరంగారావు కానీ, భానుమతి కానీ, రాజనాల కానీ, రేలంగి వెంకట్రామయ్య కానీ.. ఎవరూ కూడా తమ వారసులను పరిచయం చేయలేదు. సినిమా రంగం అంటే.. వారసత్వంగా అబ్బేది కాదని.. ఎవరికి వారు టాలెంట్ ఉంటే.. సినిమా రంగంలో రాణించవచ్చని.. వారు ద్రుఢంగా నమ్మారు. అయితే.. ఎన్టీఆర్ ప్రభావం సినిమా రంగంపై పడిన తర్వాత.. ఆయన మాటకు,, ఆయన హవాకు ప్రచారం పెరిగిన తర్వాత.. ఎన్టీఆర్ తన వారసులను రంగంలోకి తీసుకువచ్చారు.
యాదృచ్ఛికంగా అయినా.. ఉద్దేశ పూర్వకమే అయినా.. ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు హరి కృష్ణ సహా బాలకృష్ణను సినీ రంగంలోకి తీసుకువచ్చారు. వీరిలో హరికృష్ణ కొన్ని పాత్రల్లో నటిస్తే బాలయ్య ఎన్టీఆర్ నటవారసుడిగా హీరోగా రాణించాడు. వీరిద్దరి తర్వాత.. మరో ఇద్దరు కుమారులను ప్రొడక్షన్ రంగంలోకి తీసుకువచ్చారు. అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చినా.. ఎన్టీఆర్ పట్టించుకోలేదు. టాలెంట్ అనేది ఉంటే వాళ్లే సక్సెస్ అవుతారని ఎన్టీఆర్ అనేవారు.
ఇక, ఆ తర్వాత.. నాగేశ్వరరావు.. తన కుమారుడు.. నాగార్జునను వెండి తెరకు పరిచయం చేశారు. వాస్తవానికి ఏఎన్నార్ నాగార్జునను హీరోను చేయాలని ముందుగా అనుకోలేదు. అందుకే పెళ్లి కూడా చేసేశారు. ఇంజనీరింగ్ చదివిన నాగ్‌ను వ్యాపార రంగంలో పెట్టాలని అనుకున్నారు. అయితే నాగార్జునకు సినిమాల మీద ఆసక్తి ఉండడం, ఇటు ఎన్టీఆర్ కుమారులు కూడా సినీ రంగంలో ఉండడంతో నాగ్ ఎంట్రీకి ఏఎన్నార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
తర్వాత.. నిర్మాతలు కూడా అన్నగారి బాటలో నడిచారు. ఈ క్రమంలో నాగేశ్వరరావుతో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన జగపతి పిక్చర్స్ అధినేత విబి. రాజేంద్ర ప్రసాద్ తనయుడు జగపతి బాబు తెరమీదికి వచ్చారు. ఇక, తర్వాత ఘట్టమనేని కృష్ణ.. కూడా తన ఇద్దరు కుమారులను రంగంలోకి దింపారు. అయితే.. వీరిలో టాలెంట్ ఉన్నవారు మాత్రమే పుంజుకున్నారు.
కృష్ణ కుమారుల్లో రమేష్‌బాబును స్టార్‌ను చేయాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు.. సాధ్యంకాలేదు. చివరకు ఆయన సినిమాలకే దూరమైపోయాడు. అయితే ఆయన చిన్న కుమారుడు ఈ రోజు టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. కానీ, వాస్తవానికి వారసుల రాకతో.. సినీరంగంలో హీరోలు అవ్వాలని వచ్చిన అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే నిలిచిపోయారు. ఏదేమైనా.. సినీ రంగంలో వారసత్వం గురించిన చర్చ వస్తే.. మాత్రం దీనికి ఆది పురుషుడు అన్నగారేనని ఇప్పటికీ చెప్పుకోవడం గమనార్హం.